పేలిందేంటి?..సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి తెలియని స్పష్టమైన కారణం?

పేలిందేంటి?..సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి తెలియని స్పష్టమైన కారణం?
  • బాయిలర్​ పైపుల్లో అడ్డంకుల వల్లే ఒత్తిడి పెరిగి పేలి ఉండొచ్చని ఆఫీసర్ల అనుమానం

హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందని అంతా అనుమానిస్తున్నా.. ఆఫీసర్లు మాత్రం కాదంటున్నారు.  బాయిలర్​ నుంచి వచ్చే పైపుల్లో అడ్డంకులు ఏర్పడి వేడి గాలి ఒత్తిడి పెరగడం వల్లే పేలుడు సంభవించిందని చెబుతున్నారు. నిజానికి రియాక్టర్లకు ఏమీ కాలేదని, ఒకవేళ అవి పేలి ఉంటే ఊహకందని నష్టం జరిగేదని అంటున్నారు. కాగా, పేలుడు జరిగిన టైంలో 150 మంది కార్మికు

లు అక్కడ పని చేస్తున్నారు.

ఈ ఘటనలో15 మంది చనిపోగా.. వారంతా ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు చెందినవారే. పేలుడు ధాటికి పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూలడం వల్లే మృతుల సంఖ్య పెరిగింది. గాయపడిన కార్మికులను పటాన్​చెరుతోపాటు చందానగర్​, బీరంగూడలోని పలు దవాఖానలకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. పేలుడు ధాటికి15 మృతదేహాలు పూర్తిగా కాలిపోగా, అధికారులు బంధువుల సాయంతో అతికష్టం మీద ఇప్పటివరకు 3 డెడ్​బాడీలను మాత్రమే గుర్తించారు. మిగతా 12 మంది మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. కలెక్టర్, ఎస్పీతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కొంతమంది క్షతగాత్రులను మదీనాగూడ ప్రణామ్ హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడికి వెళ్లి వారిని పరామర్శించారు. 15 డెడ్​బాడీలను పటాన్​చెరు ఏరియా హాస్పిటల్​కు తరలించారు. మంత్రి ఆదేశాలతో వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం పటాన్‌చెరు ఏరియా దవాఖానకు వెళ్లింది. అక్కడ డెడ్​బాడీలకు డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించి మృతులు ఎవరో తేల్చనున్నారు. 

వర్షంతో శిథిలాల తొలగింపునకు ఆటంకాలు 

మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలగా..అధికారులు 11 జేసీబీలతో శిథిలాల తొలగింపు చేపట్టారు. భారీ వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్​ కష్టంగా మారింది. ఇవి పూర్తిగా తొలగిస్తే తప్ప వాటి కింద ఎంత మంది ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. కాగా, 40 మంది కార్మికుల ఆచూకీ దొరకడం లేదంటూ వారి కుటుంబసభ్యులు ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగారు. తమవారికి ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్​ చేయడం లేదని, వారి వివరాలు తెలపాలని డిమాండ్​ చేశారు.    

డ్రైయింగ్, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లలో సమస్యవల్లే..

ఆ ఫ్యాక్టరీలో మైక్రో క్రిస్టలైజ్ సెల్యులోజ్ తయారు చేస్తారు. డ్రైయింగ్, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లలో ఏదో ఒకచోట తలెత్తిన సమస్య వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు. కచ్చితంగా ఉదయం 9:38 గంటలకు బ్లాస్టింగ్ జరిగిందని మాత్రం చెప్పగలం. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ఎంత మంది ఉన్నారన్నది తెలియదు. ఫైర్ డీజీ నాగిరెడ్డి