మీరు ప్రకృతి ప్రేమికులా..? అయితే ముస్సోరి చూడాల్సిందే

మీరు ప్రకృతి ప్రేమికులా..? అయితే ముస్సోరి చూడాల్సిందే

వింటర్​ సీజన్​లో హిమాలయ పర్వత అందాలను చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ పర్వత శిఖరాలతోపాటు చూసేందుకు అక్కడ చాలా ప్లేస్​లు ఉంటాయి. క్వీన్​ ఆఫ్ హిల్స్​గా పేరుగాంచిన ముస్సోరి మరింత ప్రత్యేకం​. అక్కడ ప్రకృతి అందాలతోపాటు ప్రాచీన దేవాలయాలు, జలపాతాలు, లోయలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఉన్నాయి. ఇన్ని స్పెషాలిటీస్​ ఉన్న ముస్సోరి గురించి తెలుసుకోవాల్సిన విషయాలే ఇవి. 

ముస్సోరిని ‘‘క్వీన్ ఆఫ్ హిల్స్’’అంటారు. ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో ఉంది. ఇది హిమాలయాల కింది భాగంలో సముద్ర మట్టానికి సుమారు1,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో శివాలిక్ పర్వత శ్రేణులు, డూన్ వ్యాలీ చాలా ఫేమస్. పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రిలకు ముస్సోరి గేట్​ వే. ముస్సోరి అనే పేరు ‘‘మాన్సూర్’’ అనే ఒక ఔషధ మూలిక నుండి వచ్చింది. ఈ ఔషధ మొక్క ఇక్కడ పుష్కలంగా దొరుకుతుంది. ఇక్కడి ప్రజలు దీన్ని ‘‘మాన్సూరి’’ అంటారు. జ్వాలా దేవి, నాగ దేవత, భాద్రాజ్ ఆలయాలు ముస్సోరిలో పాపులర్​ టెంపుల్స్. 
ఫేమస్ టెంపుల్స్​ 
జ్వాలాదేవి టెంపుల్ సముద్రమట్టానికి సుమారు 2,100 మీటర్ల ఎత్తులో ఉంది. నాగదేవత టెంపుల్​కు భక్తులు నాగ పంచమినాడు ఎక్కువ సంఖ్యలో వెళ్తారు. గన్ హిల్, లాల్ తిబ్బా, నాగ తిబ్బా కొండలు ప్రత్యేకం. గన్ హిల్ సముద్ర మట్టానికి 2,122 మీటర్ల ఎత్తులో ఉంది. ముస్సోరిలో రెండో ఎత్తైన కొండ ఇది. దీనికి ఒక  చారిత్రక ప్రాముఖ్యత​ ఉంది. అదేంటంటే మన దేశానికి ఇండిపెండెన్స్ రాకముందు, ఈ హిల్ స్టేషన్ నుండి ప్రతి రోజూ మధ్యాహ్నం వేళ ప్రజలకు  టైం చెప్పేందుకు ఒక ఫిరంగిని పేల్చేవారు. దాంతో అక్కడి ప్రజలు వాళ్ల వాచ్​లలో టైం సరిచేసుకునేవాళ్లట. ఈ కొండపై రిజర్వాయర్ కూడా ఉంది. 

డిపో హిల్
ముస్సోరిలో లాల్ తిబ్బా కొండ మీద ఒక డిపో ఉంది. అందుకని దీన్ని ‘డిపో హిల్’ అంటారు. రేడియో స్టేషన్‌‌, టీవీ టవర్లు, ఇండియన్ మిలిటరీ సర్వీసెస్ కూడా ఉండేవి.1967లో ఈ కొండ మీద జపాన్​కు చెందిన టెలీస్కోప్ ఒకటి ఏర్పాటు చేశారు. దీని ద్వారా టూరిస్టులు దగ్గరి ప్రదేశాలను, అంటే.. బందేర్పంచ్, కేదార్​ నాథ్, బద్రీనాథ్​ వంటి వాటిని చూడొచ్చు. 

కెంప్టీ వాటర్ ఫాల్ 
కెంప్టీ ఫాల్స్ సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఉంటాయి. కెంప్టీ జలపాతాలతో పాటు ఝారి పాణి ఫాల్స్, భట్టా ఫాల్స్, మోస్సి ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి అందాలకు ఫిదా అయిన జాన్ మెకినాన్ అనే బ్రిటిష్ ఆఫీసర్, దీన్ని టూరిస్ట్ ప్లేస్​గా మార్చాడని చెబుతారు. ఝారి పాణి జలపాతాల దగ్గర అడ్వెంచర్స్​ చేయొచ్చు. భట్టా ఫాల్స్, మోస్సి ఫాల్స్ రెండూ ముస్సోరి నుండి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటాయి. 

టూరిస్ట్ అట్రాక్షన్స్
ముస్సోరి టూరిస్ట్​ ప్లేస్​ మాత్రమే కాకుండా ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్​కి కూడా చాలా ఫేమస్. ఇక్కడ బ్రిటిష్​ పాలనా కాలం నాటి యురోపియన్ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో సెయింట్ జార్జ్, ఓక్ గ్రోవ్, వైన్ బెర్గ్ అల్లెన్​ స్కూల్స్​ ప్రజలకు బాగా తెలిసినవి. సర్ జార్జ్​ ఎవరెస్ట్ హౌస్ ఒక పార్క్ ఎస్టేట్. ఇది ముస్సోరిలోని గాంధీ చౌక్​లో ఉంది.1832లో సర్​ జార్జ్​ లాబోరేటరీ ఇక్కడ ఉండేది. ఇవేకాకుండా నడిచి వెళ్లేందుకు ఒంటె మూపురంలా ఉండే మెలికల దారి ఉంటుంది. ఆ రోడ్​ను కేమెల్స్ బ్యాక్ రోడ్ అంటారు. ఫ్యాబ్రిక్, జువెలరీ, స్వీట్స్, కెఫెలు వంటివి ఉండే లైబ్రరీ బజార్, బోటింగ్ కోసం లేక్ మిస్ట్, అడ్వెంచర్స్​ చేసే స్నో అడ్వెంచర్ జోన్, బెనోగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, క్రైస్ట్ చర్చ్, కెల్లాగ్ మెమోరియల్ చర్చ్​లు ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్స్​.  

ఇలా వెళ్లాలి
ముస్సోరికి దగ్గర్లో​ డెహ్రాడూన్​లో జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఉంది. ఇది ముస్సోరికి సుమారు60 కి. మీ.ల దూరంలో ఉంటుంది. డెహ్రాడూన్​ రైల్వే స్టేషన్ కూడా ముస్సోరి దగ్గర్లో ఉంది. ముస్సోరిలో క్లైమెట్ అన్నికాలాల్లో అనుకూలంగా ఉంటుంది. అయితే సమ్మర్, వింటర్ సీజన్​లలో విజిట్ చేస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 
ముస్సోరిలో హిందీ, పంజాబీ, కుమవోనీ, ఇంగ్లిష్​ మాట్లాడతారు. ఇక్కడ ఎక్కువగా గర్వాలి, టిబెటన్లు ఎక్కువగా ఉంటారు. ముస్సోరిలో ఐదువేల మంది పెరా టిబెటన్లు ఉంటారు. వాళ్లంతా హ్యాపీ వ్యాలీలో సెటిలైయారు. ఇక్కడ వసంత పంచమి, ఉత్తరనీ లేదా కలే కువా, ఫూల్​దెలీ, సంవత్సర్​ పరేవా, హరియాలా, బికౌతి, గీయా సంక్రాంతి లేదా ఓల్గియా, శ్రావణ్​ మేళా, భద్రజ్​ ఫెయిర్, కుంజాపురి ఫెయిర్ వంటి చాలా పండుగలు జరుపుకుంటారు. హ్యాండీ క్రాఫ్ట్స్, ఇత్తడి వస్తువులు చాలా అట్రాక్టివ్​గా తయారు చేస్తారు. ప్రధానంగా వ్యవసాయం, టూరిస్ట్ హోం స్టేలతో డబ్బు సంపాదిస్తారు.

చరిత్ర 
డెహ్రాలు, గర్వాలిలను1815 సంవత్సరం నాటికి గూర్ఖాలు ఖాళీ చేయించారు.ఆ తర్వాత 1819 నాటికి సహరాన్‌‌పూర్ జిల్లాలో విలీనం చేశారు. ఈస్టిండియా కంపెనీకి చెందిన లెఫ్టినెంట్ ఫ్రెడరిక్ యంగ్,  షూటింగ్ గేమ్ కోసం ముస్సోరికి వచ్చాడు. ముస్సోరిని ఒక రిసార్ట్‌‌గా1825లో కెప్టెన్ ఫ్రెడరిక్ స్థాపించారు. అక్కడ కేమెల్ బ్యాక్ రోడ్‌‌లో షూటింగ్ లాడ్జ్‌‌ని కట్టించాడు. ముస్సోరిలో యంగ్‌‌కు సంబంధించిన ఆనవాళ్లు ఏవీ లేవు. కానీ, డెహ్రాడూన్‌‌లో ఒక ఆయన పేరు మీద రోడ్ ఉంది. అదే ఓఎన్​జీసీ టెల్ భవన్.1832లో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, జార్జ్ ఎవరెస్ట్, సర్వే ఆఫ్ ఇండియా కొత్త ఆఫీస్​ ముస్సోరిలో ఉండాలని అనేవారు. ఆ కోరికను1850లో సర్ జాన్ మానికన్ తీర్చాడు. ఐఏఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ కూడా ముస్సోరిలో ఉంది.