వాట్సప్ హ్యాక్.. వివరణ ఇవ్వాలని కేంద్రం నోటీసులు

వాట్సప్ హ్యాక్.. వివరణ ఇవ్వాలని కేంద్రం నోటీసులు

ఇండియన్ జర్నలిస్టు లు, హక్కుల కార్యకర్తలపై నిఘా

వెల్లడించిన వాట్సాప్.. రెండు డజన్ల మంది బాధితులు

వందకు పైగానే ఉండొచ్చన్న కంపెనీ

వాట్సాప్ కు నోటీసులిచ్చిన కేంద్ర ఐటీ శాఖ

ఇజ్రాయెల్​ స్పైవేర్​ పెగాసస్​ మన దేశ ప్రముఖులపై నిఘా పెట్టింది. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, కొందరు ప్రముఖుల వాట్సాప్​లను హ్యాక్​ చేసింది. దాదాపు రెండు డజన్ల మంది చాట్​ లిస్టులు, మాటలను దొంగ చాటున తెలుసుకుంది. ఈ విషయాన్ని గురువారం వాట్సాప్​ వెల్లడించింది. ఈ ఏడాది మేలో జరిగిన లోక్​సభ ఎన్నికల సందర్భంగా వాళ్ల ఫోన్లలోకి పెగాసస్​ స్పై వేర్​ చొరబడిందని వాట్సాప్​ వెల్లడించింది. ఎటాక్​కు గురైన వారందరికీ వెంటనే విషయాన్ని తెలిపింది. అయితే, ఎవరెవరు పెగాసస్​ బారిన పడ్డారో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. విద్యావేత్తలు, లాయర్లు, దళిత కార్యకర్తలూ ఆ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా 1400 మంది

మనోళ్లపైనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 1400 మందిపై పెగాసస్​ నిఘా పెట్టింది. దీనిపై అమెరికా శాన్​ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్​ కోర్టులో వాట్సాప్​ కేసు కూడా వేసింది. పెగాసస్​ను తయారు చేసిన ఇజ్రాయెల్​ కంపెనీ ఎన్​ఎస్​వో గ్రూప్​, క్యూ సైబర్​ టెక్నాలజీస్​, అమెరికా చట్టాలను ఉల్లంఘించాయని లా సూట్​లో ఆరోపించింది. మిస్స్​డ్​ కాల్స్​ రూపంలో పెగాసస్​ వైరస్​ను జొప్పించి, వాళ్ల మీద నిఘా పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్ట పరిహారం కింద సుమారు ₹53 లక్షలు (75 వేల డాలర్లు) చెల్లించాల్సిందిగా పరువు నష్టం దావా వేసింది. పెగాసస్​ నుంచి రక్షణకు వెంటనే కొత్త అప్​డేట్​ను తెచ్చామని వాట్సాప్​ వెల్లడించింది. ఇండియాలో నిఘాకు గురైన వారు ప్రస్తుతానికి రెండు డజన్ల మందే అయినా, ఆ సంఖ్య వంద దాకా ఉండొచ్చని పేర్కొంది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పింది.

మా తప్పు లేదు

వాట్సాప్​ ఆరోపణలను ఎన్​ఎస్​వో తోసిపుచ్చింది. పెగాసస్​ విషయంలో తమ తప్పేమీ లేదని సమర్థించుకుంది. జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టేందుకు తామీ పెగాసస్​ను తయారు చేయలేదని, దానికి లైసెన్స్​ కూడా లేదని చెప్పింది. పెగాసస్​ను కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే అమ్ముతామని తెలిపింది. సెప్టెంబర్​ 19న హ్యూమన్​ రైట్స్​ పాలసీని తీసుకొచ్చి కొత్తగా దానిని అభివృద్ధి చేశామని చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్​లో తొలిసారిగా అమెరికాకు చెందిన సిటిజెన్​ ల్యాబ్​ అనే సైబర్​ సెక్యూరిటీ సంస్థ ఈ పెగాసస్​ స్పైవేర్​ను గుర్తించింది. ఇండియా సహా 45 దేశాల్లో పెగాసస్​ను జొప్పించారని పేర్కొంది. ఇండియాలో 2017 జూన్​ నుంచి పెగాసస్​ యాక్టివ్​గా ఉన్నట్టు చెప్పింది.

వాట్సాప్​కు కేంద్రం నోటీసులు

పెగాసస్​ నిఘాపై సమగ్ర వివరణ ఇవ్వాల్సిందిగా వాట్సాప్​కు కేంద్ర ఐటీ శాఖ నోటీసులిచ్చింది. నవంబర్​ 4 లోపు రాతపూర్వక వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఎన్​ఎస్​వో మాటలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ఇది అమెరికాకు చెందిన వాట్సాప్​, ఇజ్రాయెల్​కు చెందిన ఎన్​ఎస్​వో అనే కంపెనీల మధ్య ఉన్న గొడవ అని చెప్పాయి. మన దేశంలో వాట్సాప్​కు అసలు సర్వరే లేదని స్పష్టం చేశాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వాట్సాప్​కు ఎప్పటినుంచో చెబుతున్నామని, అయినా కంపెనీ పట్టించుకోలేదని తేల్చి చెప్పాయి. వాట్సాప్​ హ్యాకింగ్​తో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. నిఘా పెడుతూ మోడీ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని కాంగ్రెస్​ ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ఆరోపించారు. ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదని, భయపడాల్సిన విషయమని అన్నారు., సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

ఏంటీ పెగాసస్​.. ఎలా చొరబడుతుంది?

పెగాసస్​.. నిఘా కోసం తయారు చేసిన స్పై వేర్​. ఐమెసేజ్​, వాట్సాప్​, స్కైప్​, టెలిగ్రామ్​, విచాట్​, ఫేస్​బుక్​ మెసెంజర్​ తదితర చాటింగ్​, కాలింగ్​ యాప్స్​లోకి దీన్ని జొప్పిస్తారు. నిఘా పెట్టాలనుకున్న వ్యక్తి ఫోన్​కు ఏదైనా మెసేజింగ్​ యాప్​కు వీడియో కాల్​ లేదా వాయిస్​ కాల్​ చేస్తారు. ఎత్తేలోపు ఆ కాల్​ కట్టవుతుంది. ఆ కాల్​తోనే ఒక కోడ్​ ఫోన్​లోకి మనకు తెలియకుండానే ఎంటరైపోతుంది. పెగాసస్​ స్పైవేర్​ను ఇన్​స్టాల్​ చేసేస్తుంది. ఫోన్​లో ఉంటుంది కానీ, ఉంటున్నట్టు కూడా మనకు తెలియదు. అది చొరబడ్డాక మెసేజింగ్​ యాప్​లోని మెసేజ్​లు, వాయిస్​ కాల్స్​, వీడియో కాల్స్​ వివరాలన్నింటినీ అది దోచేస్తుంది. అంతేకాదు, మన ఫోన్​లోని కాంటాక్ట్​లిస్టు, క్యాలెండర్​లో మనం పెట్టుకున్న ఈవెంట్లు, ఫోన్​ మైక్రోఫోన్​, కెమెరానూ పెగాసస్​ యాక్సెస్​ చేసేసుకుంటుంది. అవతలి వాళ్లతో మాట్లాడే విషయాలను, మెసేజ్​లను గుట్టు చప్పుడు కాకుండా తెలుసుకుంటుంది.

టార్గెట్​ అయిన వాళ్లలో కొందరి వివరాలు…

భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పలువురునిందితుల తరఫున వాదిస్తు న్న లాయర్ ,మానవ హక్కుల కార్యకర్త నిహాల్ సింగ్రాథోడ్ ఉన్నట్టు తెలుస్తోంది. స్వచ్ఛంద కార్యకర్త బేలా భాటియా, లాయర్ ,స్వచ్ఛంద కార్యకర్త డిగ్రీ ప్రసాద్ చౌహాన్ ,హక్కుల కార్యకర్త ఆనంద్ తేల్ తుంబ్డె,
జర్నలిస్ట్​ సిద్ధాంత్ సిబల్  ఇప్పటి వరకు తెలిసిన బాధితుల వివరాలివి.