
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది రష్మిక మందన్న. ఇప్పటికే చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తనకు మరో ఆఫర్ వచ్చింది. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా శిబిచక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించే చాన్స్ అందుకుంది. ఇది కేవలం రష్మిక మాత్రమే చేయగలిగిన పాత్ర అని దర్శకుడు శిబిచక్రవర్తి భావిస్తున్నాడట. అందుకే ఆమెను కలిసి కథను చెప్పగా రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
తమిళంలో ఆమె ఇప్పటికే సూర్య సరసన చాన్స్ అందుకుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా అక్కడ మరో ఆఫర్ రావడంతో కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది రష్మిక. ప్రస్తుతం ఆమె..పుష్ప2తో పాటు ఫిమేల్ లీడ్‌గా గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ధనుష్ ‘కుబేర’, హిందీలో ఛావ, సికిందర్ సినిమాలు చేస్తోంది.
వీటితో పాటు మరికొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో తగ్గేదేలే అంటూ తనకు వరుస ఆఫర్స్ రావడం పట్ల రష్మిక ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్‌కి జంటగా ఆమె నటించిన ‘పుష్ప ది రూల్’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.