
- కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
- ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
- దేవాలయ భూముల రికార్డులు ధరణిలో నమోదు చేయాలి
- టెంపుల్స్ పేరుతో పాస్‌బుక్‌లు జారీ చేయాలి
- దేవాదాయ శాఖ అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖకు చెందిన 15,000 ఎకరాల భూములకు శాశ్వత పరిష్కారం దిశగా జియో ట్యాగింగ్ చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జియో ట్యాగింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. లీజుకు ఇచ్చిన దేవాలయ భూములు, షాపుల వివరాలు, వాటి ద్వారా సమకూరుతున్న ఆదాయం, లీజు, రెంట్ బకాయిలను వీలైనంత త్వరగా రాబట్టాలని సూచించారు.
మంగళవారం అబిడ్స్ బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కమిషనరేట్ లో మంత్రి సురేఖ ఆ శాఖపై సుదీర్ఘ రివ్యూ చేపట్టారు. ఈ మీటింగ్ లో ఎండో మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల ఈవోలు పాల్గొన్నారు. డిపార్ట్ మెంట్ పై సమగ్ర వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. కబ్జాకు గురైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకునే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అన్నారు. దేవాలయ భూ వివాదాల పరిష్కారానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు త్వరితగతిన పరిష్కారానికి సమర్థులైన అడ్వకేట్లను నియమించుకోవాలని, కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను క్లియర్ చేయాలని సూచించారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నమోదైన దేవాలయ భూముల వివరాలు, ధరణిలో నమోదైన భూముల వివరాల్లో తేడాలు ఉండటంపై మంత్రి అధికారులను ప్రశ్నించారు. ధరణిలో దేవాదాయ శాఖ భూముల వివరాలు నమోదయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు సంబంధిత దేవాలయాల పేరు మీద పాస్ బుక్ లు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. దేవాలయ భూముల్లో ఫంక్షన్ హాల్స్, ఇతర ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఆలయ భూములకు రక్షణ ఉండటంతో పాటు దేవాదాయ శాఖకు ఆదాయం సమకూరుతుందని, ఈ దిశగా ప్రణాళికలు రచించాలని సూచించారు.
భక్తులకు వసతులు పెంచండి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని టెంపుల్స్ లో కనీస సదుపాయాల కల్పనపై క్రమం తప్పకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. దేవాలయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, చెత్త నిర్వహణకు మున్సిపాలిటీల సహకారం తీసుకోవాలని అన్నారు. దేవాలయాల్లో ప్రసాదం అమ్మకాలకు వాడే ప్లాస్టిక్ కవర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, వీటితో పాటు పచ్చదనం వెల్లివిరిసేలా దేవాలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రముఖ దేవాలయాలన్నీ నిరంతరం సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను గుర్తించి, వాటి అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని, పలు దేవాలయాల అభివృద్ధికి ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ చేపడుతున్న చర్యలను నిరంతరం సమీక్షించాలని అధికారులకు సూచించారు. కాగా, దేవాలయ వివరాలను తెలుసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ను కూడా రూపొందించనున్నట్టు అధికారులు మంత్రికి తెలిపారు.
జీవవైవిధ్యంతోనే మానవాళికి మనుగడ
భూమిపై జీవ వైవిధ్యం వర్ధిల్లినప్పుడే మానవాళికి మనుగడ ఉంటుందని కొండా సురేఖ తెలిపారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జీవ వైవిధ్యం సృష్టి లక్షణమని, ఈ భూమి కేవలం మనిషికి మాత్రమే సొంతం కాదని, సమస్త జీవరాసులకు ఈ భూమి పై హక్కులున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జీవ వైవిధ్య పరిరక్షణకు ఊతమిచ్చేలా జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు.
ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలి
సీఎస్ఆర్ నిధుల కోసం ప్రత్యేకమైన పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు. టెంపుల్స్ పై మీడియాలో వచ్చే వ్యతిరేక కథనాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని, ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ పరిధిలో పనిచేసే ప్రతి అధికారి అంకిత భావంతో దేవాలయాల నిర్వహణను కట్టుదిట్టంగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, ధార్మిక సంస్థల్లో జరుగుతున్న వ్యవహారాలపై అధికారులు వాట్సాప్ గ్రూపుల్లో నిరంతరం చర్చిస్తూ, వ్యవస్థను గాడిలో పెట్టాలని అన్నారు.
దేవాలయాలు, దేవాదాయ శాఖ అధికారుల పై వచ్చే వ్యతిరేక కథనాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఆరోపణలు నిజమని తేలితే వెంటనే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు జూమ్ మీటింగ్స్ ద్వారా నిరంతరం దేవాదాయ శాఖ కార్యకలాపాలను పర్యవేక్షించాలని సూచించారు. టెండర్లను అత్యంత పారదర్శకతో చేపట్టేందుకు గైడ్ లైన్స్ రూపొందించాలని మంత్రి అధికారులకు సురేఖ సూచించారు.