ఏపీలో మెడికల్ కాలేజీల ఎపిసోడ్ అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చుతూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వైసీపీ. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టింది వైసీపీ. బుధవారం ( డిసెంబర్ 24 ) మెడికల్ కాలేజీల టెండర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు. మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు.
బిడ్డర్స్ తో నేరుగా సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని.. కాలేజీ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చంద్రబాబు. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని అన్నారు చంద్రబాబు.ఏపీలో కూడా అదే విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి ప్రజలపై భారం పడకుండా మెరుగైన వైద్య విద్య అందిస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు.
►ALSO READ | తిరుపతి అలిపిరి దగ్గర భారీ ట్రాఫిక్ జామ్.. చెక్ పాయింట్ దగ్గర బారులు తీరిన వాహనాలు....
మెడికల్ కాలేజీల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమని.. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు చంద్రబాబు. మరో పక్క ఆదోని మెడికల్ కాలేజీ మినహా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించిన మెడికల్ కాలేజీలకు బిడ్డర్లు ముందుకు రాకపోవడాన్ని తమ విజయంగా భావిస్తోంది వైసీపీ. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యల కారణంగానే బిడ్డర్లు ముందుకు రాలేదని.. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా తాము చేపట్టిన ఉద్యమం సక్సెస్ అయ్యిందని అంటున్నారు వైసీపీ శ్రేణులు.
