హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్టులలో విభజనను తీసుకొచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (టీజేఎఫ్టీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అక్రెడిటేషన్ కార్డుల విషయంలో డెస్క్ జర్నలిస్టులు, రిపోర్టర్లును వేరు చేసేలా ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవడం సహేతుకం కాదని పేర్కొంది.అక్రెడిటేషన్ పాలసీ కి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 252ను సవరించాలని ప్రభుత్వానికి టీ జే ఎఫ్ టీ విజ్ఞప్తి చేసింది. డెస్కు జర్నలిస్టులకు బస్ పాసుల విషయమై ఐ అండ్ పీఆర్ అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది.
వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టుల సమావేశం
బుధవారం చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో జరిగింది. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్ టీ) కొత్తగా ఏర్పాటైంది. కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో పాటు, డెస్క్ జర్నలిస్టుల సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... రిపోర్టర్, డెస్క్ జర్నలిస్టులిద్దరూ వర్కింగ్ జర్నలిస్టు కిందికే వస్తారని, అలాంటిది వారిని విభజించడం సరికాదన్నారు.
ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనే వివక్ష చూపించేలా అధికారులు వ్యవహరించటం ఏంటని ప్రశ్నించారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వబోమని, మీడియా కార్డుల పేరిట కొత్తగా కార్డులు జారీ చేస్తామని చెప్పడం సరికాదన్నారు. ఇది డెస్క్ జర్నలిస్టులను సెకండ్ గ్రేడ్ కి నెట్టడమే తప్పా ఇంకోటి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి ధర్మాన్ని కాపాడేందుకు ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న డెస్క్ జర్నలిస్టులకు జీవో 252 శరాఘాతం లాంటిదేనన్నారు.
►ALSO READ | మాదాపూర్ తమ్మిడికుంట, కూకట్ పల్లి నల్ల చెరువు పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
పోరాడి సాధించుకున్న అక్రెడిటేషన్ హక్కును గుంజుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో స్క్రీనింగ్ చేసేందుకే ఈ విభజన అనే అనుమానం అందరిలో ఉందని పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కార్డులు, మీడియా కార్డులకు ఒకే రకమైన సంక్షేమ పథకాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు..అలాంటప్పుడురెండు కార్డులు తీసుకురావాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నించారు.
గతంలో ఇచ్చినట్టు వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హెచ్యూజే అధ్యక్ష, కార్యదర్శులు బి.అరుణ్ కుమార్, బి.జగదీశ్, టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు బి.రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి గండ్ర నవీన్, డబ్ల్యూఐజే రాష్ట్ర సెక్రటరీ రావికంటి శ్రీనివాస్, పలువురు సీనియర్ రిపోర్టర్లు పాల్గొని మద్దుతు ప్రకటించారు.
డీజేఎఫ్ టీ కొత్త కమిటీ ఎన్నిక..
డీజేఎఫ్ టి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిగా బాదిని ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా మస్తాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెజరర్గా నిస్సార్, ఉపాధ్యక్షుడిగా కేవీ రాజారామ్, జాయింట్ సెక్రెటరీగా విజయ తదితరులు ఎన్నికయ్యారు.
ఆమోదించిన తీర్మానాలు..
* డెస్క్ జర్నలిస్టులకూ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి.
* డెస్క్ జర్నలిస్టులను అవమానించేలా, వర్కింగ్ జర్నలిస్టులను వేరు చేసేలా ఉన్న జీవో నెంబర్ 252 ను సవరించాలి.
* అక్రెడిటేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలి.
* రాష్ట్రంలో ఐ అండ్ పీఆర్ కమిషనర్ను, జిల్లాల్లో కలెక్టర్లను కలిసి డెస్క్ జర్నలిస్టులు వినతిపత్రాలు ఇవ్వాలి.
* హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేయాలి.
* మన సమస్యలను సంబంధిత అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలి.
* రాష్ట్రంలో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టులు అందరిని సంఘటితం చేస్తూ, డెస్క్ జర్నలిస్టుల సంఘాన్ని పటిష్టపరుచుకోవాలి.
* మన హక్కులు సాధనలో కలిసి వచ్చే రిపోర్టర్లు, పాత్రికేయ సంఘాలు, సంఘాల నేతలను కలుపుకొని వెళ్లాలి.
