విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలో కొత్తగా మరో మూడు ఎయిర్ లైన్స్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలో కొత్తగా మరో మూడు ఎయిర్ లైన్స్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు దేశంలో కొత్తగా మరో మూడు విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్, శంఖ్ ఎయిర్ విమానయాన సంస్థలు వచ్చే ఏడాది (2026) నుంచి దేశంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం (డిసెంబర్ 24) పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఈ మూడు క్యారియర్లకు నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఎన్‌ఓసీ) లభించాయి. 

ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ధృవీకరికరించారు.  ‘‘భారత గగనతలంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్న కొత్త ఎయిర్ లైన్స్ శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ బృందాలను కలవడం సంతోషంగా ఉంది. శంఖ్ ఎయిర్ ఇప్పటికే ఎన్వోసీ పొందగా.. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ ఈ వారం తమ ఎన్వోసీలను అందుకున్నాయి’’ అని పేర్కొన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటైన భారతీయ విమానయానంలో మరిన్ని ఎయిర్ లైన్స్‎ను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 

అల్ హింద్ ఎయిర్ బ్యాగ్రౌండ్:

కేరళకు చెందిన అల్హింద్ గ్రూప్ అల్ హింద్ ఎయిర్‌ను ప్రమోట్ చేస్తోంది. అల్ హింద్ ఎయిర్‌ విమానయాన సంస్థ ప్రాంతీయ కమ్యూటర్ ఎయిర్‌లైన్‌గా కార్యకలాపాలను ప్రారంభించి మెల్లగా అంతర్జాతీయ మార్గాలకు సర్వీసులను విస్తరించాలని భావిస్తోంది.  ATR 72-600 విమానాల సముదాయంతో దేశంలో సేవలను ప్రారంభించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. 

ఇండిగో దెబ్బకు కేంద్రం అలర్ట్:

దేశ విమానయాన రంగంలో 65 శాతానికి పైగా మార్కెట్ వాటా కలిగి ఉన్న ఇండిగో ఎయిర్ లైన్స్‎లో ఇటీవల భారీ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సంస్థ అంతర్గత రోస్టరింగ్ వైఫల్యంతో ఇండిగో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

దీంతో అప్రమత్తమైన కేంద్రం ప్రభుత్వం ఒకే సంస్థ గుత్తాధిపత్యం చెలాయించకుండా మరికొన్ని విమానయాన సంస్థలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే దేశంలో మరో మూడు కొత్త ఎయిర్ లైన్స్ కు అనుమతులు ఇచ్చింది. ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడంలో మూడు కొత్త విమానయాన సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

►ALSO READ | వెనక్కి తగ్గిన మోడీ సర్కార్: ఆరావళిలో మైనింగ్‎పై పూర్తి నిషేధం