ఇన్ఫెక్షన్ల ప్రభావం ప్రెగ్నెన్సీపై పడుతుందా?

ఇన్ఫెక్షన్ల ప్రభావం ప్రెగ్నెన్సీపై పడుతుందా?

వైట్​ డిశ్చార్జ్​​​(తెల్లబట్ట).. చాలామంది ఆడవాళ్లు దీన్నో హెల్త్​ ఇష్యూగా చూడరు. కానీ ఆ డిశ్చార్జ్​ పసుపు, ఆకుపచ్చ రంగులోకి మారినా, రక్తంతో కలిసి వచ్చినా, చెడు వాసన వచ్చినా ఆలోచించాలి.  కొన్నిసార్లు  వజైనాలో విపరీతమైన మంట, దురద కూడా వస్తుంటాయి. ఇవన్నీ కలిపి ఉన్నాయంటే కారణం వజైనల్​ ఇన్ఫెక్షన్. ఈ పరిస్థితిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు గైనకాలజిస్ట్​ ఎమ్​. రజిని. అసలు ఈ ఇన్ఫెక్షన్స్​ ఎందుకొస్తాయి?  వీటి తీవ్రత ఎలా ఉంటుంది?  
ఇవి ఎన్ని రకాలు? అనే విషయాలతో పాటు ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆమె మాటల్లోనే..

వజైనల్​ ఇన్ఫెక్షన్స్​ అంటే..

ఆడవాళ్లకి మెనుస్ట్రువల్​ ఫ్లూయిడ్​​ బయటికి రావడానికి వజైనా ట్రాక్​ ఉంటుంది. ఆ ట్రాక్​ నుంచి ఆడవాళ్లకి కొద్ది మొత్తంలో వైట్​ డిశ్చార్జ్​ అవుతుండటం మామూలే. కానీ, ఆ డిశ్చార్జ్​లో మార్పులు కనిపించినా.. వజైనా పొడిబారి మంట, దురద లాంటివి వచ్చినా. యూరిన్​లో మంట, దురద వచ్చినా. అప్పుడప్పుడు స్పాటింగ్​ కనిపించినా.. వజైనల్​ ఇన్ఫెక్షన్స్​ ఉన్నట్టే.

ఈ ఇన్ఫెక్షన్స్​ ఎక్కువగా ఎందువల్ల వస్తాయి?

ఫంగస్‌‌ వల్ల కానీ ప్రోటోజువా జాతికి చెందిన ట్రైకోమొనాస్​ అనే పరాన్న జీవి వల్ల  లేదా బ్యాక్టీరియా వల్ల కానీ ఈ ఇన్ఫెక్షన్స్​ వస్తాయి. రక్తహీనత, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం, వజైనల్​ ఫ్లోరాలో పీహెచ్​ ఆల్టరేషన్స్​ అయినప్పుడు, నార్మల్​ బ్యాక్టీరియా ఫ్లోరా దెబ్బతిన్నప్పుడు, ప్రైవేట్​ పార్ట్స్​లో సబ్బులు, పెర్ఫ్యూమ్​లు వాడటం, డయాబెటిస్​, ఊబకాయం.. ఇలా వజైనల్​ ఇన్ఫెక్షన్స్​కి దారితీసే కారణాలు చాలానే ఉన్నాయి. ఆ కారణాల్ని బట్టే ఏ రకం వజైనల్​ ఇన్ఫెక్షన్​ సోకిందన్నది నిర్థారించుకుంటాం.

వజైనల్​ ఇన్ఫెక్షన్స్​లో ఎన్ని రకాలున్నాయి?

ఈ ఇన్ఫెక్షన్స్​లో చాలా రకాలు ఉన్నప్పటికీ.. వాటిల్లో ముఖ్యంగా వీటి గురించి చెప్పుకోవాల్సినవి ఇవి.

బ్యాక్టీరియల్:   సాధారణంగా వజైనాలో మంచి బ్యాక్టీరియా,  చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. ఈస్ట్రోజన్​ హార్మోన్​ ప్రభావం వల్ల మంచి బ్యాక్టీరియా  అయిన ల్యాక్టోబాసిల్లి నుంచి విడుదలయ్యే ల్యాక్టిక్​ యాసిడ్ వజైనాలో​  ఎసిడిక్​  పీహెచ్​ ఉండేలా చూస్తుంది. అది చెడు బ్యాక్టీరియాను డెవలప్​ కానీయదు. కానీ, కొన్ని సందర్భాల్లో వజైనాలో పీహెచ్​ ఇంబ్యాలెన్స్​ అవుతుంది. దానివల్ల  చెడు బ్యాక్టీరియా, రోగ కారక క్రిములు  పెరిగి బ్యాక్టీరియల్​ వజైనాసిస్​ ఇన్ఫెక్షన్​ వస్తుంది. ముఖ్యంగా వజైనాలో గార్డెనెరిల్లా అనే బ్యాక్టీరియా ఎక్కువగా పెరగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్​ వస్తుంది. 

వజైనల్‌‌ ఫంగల్‌‌ ఇన్ఫెక్షన్‌‌: ఈఇన్ఫెక్షన్‌‌ ‘క్యాండిడా’ అనే ఫంగస్‌‌ వల్ల వస్తుంది. నోరు, గొంతు, జీర్ణ వ్యవస్థతో పాటు వజైనాలోనూ సాధారణంగానే ‘క్యాండిడా’ ఉంటుంది. కానీ, కొన్నిసార్లు దీని  ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల ఫంగల్​ ఇన్ఫెక్షన్​ వస్తుంది. ముఖ్యంగా రక్తహీనత, డయాబెటిస్‌‌ ఉన్నవాళ్లలో, యాంటీ బయాటిక్స్​, ఓరల్‌‌ కాంట్రాసెప్టివ్‌‌ పిల్స్‌‌ , స్టిరాయిడ్స్​ఎక్కువగా వాడే వాళ్లలో ఈ రకం ఇన్ఫెక్షన్​  కనిపిస్తుంటుంది.

క్లెమీడియా ఇన్ఫెక్షన్​ : క్లెమీడియా ట్రాకోమాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్​ వస్తుంది.  ఇది ఇంటర్​కోర్స్(సంభోగం)​ వల్ల ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్​ఫర్​ అవుతుంది. ఇన్ఫెక్షన్‌‌ని నిర్లక్ష్యం చేస్తే క్లెమీడియా బ్యాక్టీరియా వజైనా  నుంచి గర్భాశయంలోకి కూడా వెళ్తుంది. ఈ ఇన్ఫెక్షన్​ వల్ల కొన్నిసార్లు ఫెలోపియన్​ ట్యూబ్స్​ మూసుకుపోయి, ప్రెగ్నెన్సీకి ఇబ్బందులొస్తాయి. క్లెమీడియా ఇన్ఫెక్షన్‌‌ ఒకసారి వచ్చిపోయినా, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వాళ్ల రోగనిరోధకశక్తిని బట్టి ఇంటర్​ కోర్స్​ తర్వాత మళ్లీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 

గనేరియా ఇన్ఫెక్షన్స్​:  క్లెమీడియాలానే గనేరియా కూడా సెక్సువల్లీ ట్రాన్స్​మిటెడ్​ ఇన్ఫెక్షన్​. నీసేరియా గనేరియా అనే బ్యాక్టీరియా వల్ల  ఈ ఇన్ఫెక్షన్​ వస్తుంది. ఇది కూడా వజైనా నుంచి మూత్రనాళాల్లోకి, గర్భాశయంలోకి, కొన్నిసార్లు ఫెలోపియన్​ ట్యూబ్స్​లోకి కూడా వెళ్తుంది. 

నాన్​ ఇన్ఫెక్షన్​ వెజినైటిస్:  వజైనా పొర దెబ్బతిన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్​ వస్తుంది. కెమికల్స్​తో నిండిన సబ్బులు, పెర్ఫ్యూమ్స్​, లోషన్స్, క్రీమ్స్​ని  ప్రైవేట్​ పార్ట్స్​లో వాడటం వల్ల ఈ ఇన్ఫెక్షన్​ ఎక్కువగా వస్తుంది. 

ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందనేది ఎలా తెలుసుకోవచ్చు?

లక్షణాల​ని బట్టి ఇన్ఫెక్షన్​ ఉందో, లేదో  తెలుసుకోవచ్చు. మొదట బేసిక్​ ట్రీట్మెంట్​ ఇస్తాం. దానికి కూడా కంట్రోల్​ అవ్వకపోతే కంప్లీట్ యూరిన్ టెస్ట్, యూరిన్ కల్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, వెజైనల్ స్వాబ్ లాంటి  టెస్ట్​లు చేయాలి. వాటి ద్వారా ఇన్ఫెక్షన్​కి కారణం, అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మందులు వాడితే సరిపోతుంది. 

బిగుతు బట్టలు కూడా కారణమా? 

టైట్​ లెగ్గింగ్స్​, జీన్స్​, నైలాన్​ ప్యాంటీస్​ వల్ల వజైనల్​ ఇన్ఫెక్షన్స్​​ వచ్చే అవకాశం ఉంది. అవి ఎక్కువ సేపు వేసుకోవడం వల్ల ప్రైవేట్​ పార్ట్స్​లో చెమట బాగా  పడుతుంటుంది. ఆ తేమ వజైనల్​ ఇన్ఫెక్షన్​కి కారణం అవుతుంది. అలాగే వర్కవుట్, స్విమ్మింగ్‌‌, స్నానం లాంటివి చేశాక వజైనాలో తేమ లేకుండా చూసుకోవాలి. 

ఇన్ఫెక్షన్​ ఉన్నప్పుడు ప్యాంటీస్​ అవాయిడ్​ చేయాలా?

లేదు..దానివల్ల సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. చాలామంది వజైనల్ ఇన్ఫెక్షన్స్​ వచ్చినప్పుడు ప్యాంటీస్​ వేసుకోరు. దానివల్ల ఆ డిశ్చార్జ్​ బయటకు  స్ర్పెడ్​ అవుతుంది.  దాంతో తొడల మధ్యలో ర్యాష్, మంట వస్తాయి. అందుకే ప్యాంటీస్​ కంపల్సరీ. అయితే రెండు మూడు గంటలకొకసారి ప్యాంటీస్​ మార్చాలి. కాటన్​ ప్యాంటీస్​ మాత్రమే వేసుకోవాలి. అలాగే పీరియడ్స్​(నెలసరి) అప్పుడు శానిటరీ న్యాప్​కిన్స్​ పూర్తిగా తడిసినా, తడవకపోయినా ఆరు గంటలకి ఒకసారి మార్చుకోవాలి. ఆర్గానిక్​ న్యాప్​కిన్స్​ మాత్రమే వాడాలి. 

వీటి ప్రభావం ప్రెగ్నెన్సీపై పడుతుందా? 

కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్​ వల్ల ఫెలోపియన్​ ట్యూబ్స్​ బ్లాక్​ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి కాకుండా అక్కడే పెరుగుతుంది. దాన్నే ఎక్టోపిక్​ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని త్వరగా గుర్తించకపోతే ఫెలోపియన్​ ట్యూబ్స్ పగిలిపోయి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్​ వజైనా నుంచి గర్భ సంచి ఎండోమెట్రియం(గర్భాశయపు లోపలి మ్యూకస్​ ​పొర) వరకు వెళ్తాయి. దానివల్ల అబార్షన్స్​ అయ్యే అవకాశం ఉంటుంది.  

సర్వైకల్​ క్యాన్సర్​కు ముందు ఇన్ఫెక్షన్స్​ వస్తాయా? 

కొన్నిసార్లు సర్వైకల్​ క్యానర్స్ రాకముందు  స్కిన్​ మీద దెబ్బతెగలి పొట్టు ఊడితే ఎలా ఉంటుందో.. సర్విక్స్​ మీద కూడా అలా ఎరోజన్స్​ ఏర్పడతాయి. అలాంటప్పుడు​ ఎక్కువ డిశ్చార్జ్​ అవు తుంటుంది.

వజైనల్​ ఇన్ఫెక్షన్స్​ ఏ ఏజ్​లో ఎక్కువ?

రిప్రొడక్టివ్​ ఏజ్​ గ్రూప్​ అంటే 18 నుంచి 35 యేండ్ల మధ్య ఆడవాళ్లకి ఈ ఇన్ఫెక్షన్స్​ ఎక్కువగా వస్తుంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే ప్రైవేట్​ పార్ట్స్​ని క్లీన్​గా ఉంచుకోవడంతో పాటు తడి లేకుండా చూసుకోవాలి. పీరియడ్స్​లో శానిటరీ  న్యాప్​కిన్స్​​ మార్చుకునేముందు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇమ్యూనిటీ బూస్ట్​ డైట్​ని తీసుకోవాలి. పప్పులు, బాయిల్డ్​ ఎగ్స్​ లాంటి హై ప్రొటీన్​ ఫుడ్​ని ఎక్కువగా తినాలి. యాపిల్, సంత్రా లాంటి యాంటీ ఆక్సిడెంట్​ రిచ్​ ఫ్రూట్స్​ని తినాలి. విటమిన్​–డి ఎక్కువగా ఉండే ఫుడ్​ తీసుకోవాలి. మంచి బ్యాక్టీరియాని పెంచే పెరుగు ఎక్కువగా తినాలి. అయితే ఇవన్నీ పాటించినా కూడా వజైనల్​ ఇన్ఫెక్షన్స్​ వచ్చే అవకాశాలు ఉంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్​ని కన్సల్ట్​ అవ్వాలి. భార్యా భర్తలు, పార్ట్​నర్స్​లో ఏ ఒక్కరికి ఇన్ఫెక్షన్​ ఉన్నా మరొకరు కూడా ట్రీట్మెంట్​ తీసుకోవాలి.

మరిన్ని వార్తల కోసం..

ఓవర్‌‌‌‌‌‌నైట్‌‌‌‌లో 28 మంది మిలియనీర్స్‌‌‌‌

సమ్మక్క పుట్టిందెక్కడ?

పండుగలా పాత పంటల జాతర