సమ్మక్క పుట్టిందెక్కడ?

సమ్మక్క పుట్టిందెక్కడ?

వెలుగు ప్రతినిధి, మేడారం: ఆదివాసీల ఆరాధ్య దైవం, భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క పుట్టింది ఎక్కడ? పెరిగింది ఎక్కడ? తల్లిదండ్రులు ఎవరనే ప్రశ్నలకు తీరొక్క సమాధానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ తల్లి పుట్టింది ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో అని కొందరు.. కాదు జగిత్యాల జిల్లా పొలవాసలో అని మరికొందరు.. లేదు హనుమకొండ జిల్లా ఆత్మకూర్​ మండలం అగ్రంపహాడ్​లో అని ఇంకొందరు అంటున్నారు. కాదు.. కాదు.. అమ్మ పుట్టింది చత్తీస్​గఢ్​లోనే అని అక్కడి ఆదివాసీలు చాన్నాళ్లుగా ప్రచారం చేస్తున్నప్పటికీ అసలు పుట్టిన స్థలమేంటో ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు. సమ్మక్క పుట్టుపూర్వోత్తరాలు, మహిమలు, వీరత్వం గురించి తరతరాలుగా ఆదివాసీ కళాకారులు చెప్తున్న మౌఖిక సాహిత్యం, స్థానిక ప్రజల్లో తల్లి పట్ల విశ్వాసమే తప్ప లిఖితపూర్వకమైన రుజువుల్లేవంటున్నారు చరిత్ర పరిశోధకులు. 

చందా వంశపు ఆడబిడ్డనా?

తమ వంశపు ఆడబిడ్డగా సమ్మక్క బయ్యక్కపేటలో పుట్టిందని ఆదివాసీల్లోని కోయ తెగకు చెందిన చందా వంశస్తులు భావిస్తారు. జాతర జరిగే మేడారానికి ఈ గూడెం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాయిబండ రాజు పెద్ద భార్య చంద బోయిరాలు ఓ రోజు దుంపల కోసం కంక వనానికి వెళ్లి ఎల్లేరు గడ్డ తవ్వుతుండగా గడ్డపారకు ఏదో తగిలింది. తవ్వి బయటకు తీస్తే పెట్టెలో పసిబిడ్డ కనిపించిందని, ఆదిశక్తి ప్రసాదించిన సంతానంగా భావించి తీసుకెళ్లి సమ్మక్కగా నామకరణం చేశారని చందా వంశీయులు చెప్తుంటారు. సమ్మక్క జాతరను చందా వంశీయులు బయ్యక్కపేటలోనే నిర్వహించేవారు. కానీ1962 తర్వాత చందా, సిద్ధబోయిన వంశస్థుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు జాతర మేడారంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ జాతరకు ముందు వచ్చే గురువారం తమ ఇంటి ఆడబిడ్డలైన సమ్మక్క, సారలమ్మలకు బయ్యక్కపేట పూజారులు ఒడిబియ్యం, చీర, సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.  

మేడరాజు ఏలిన పొలవాసనా?

జగిత్యాల జిల్లాలోని పొలవాసే సమ్మక్క పుట్టిన స్థలమని మరో చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. పొలవాస ప్రాంతాన్ని పాలించిన మేడరాజు వేటకు వెళ్లినప్పుడు ఒక పుట్ట మీద పాపాయి దొరికిందని, ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారని చెప్తుంటారు. సమ్మక్క పెరిగి పెద్దయ్యాక తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి పెండ్లి  చేయగా సారలమ్మ, నాగులమ్మ, జంపన్న పుట్టారు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తగా.. మేడరాజు మేడారానికి వెళ్లి అజ్ఞాతవాసం గడుపుతాడు. మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, చక్రవర్తికి కప్పం కట్టకపోవడం లాంటి కారణాలతో ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తాడనే గాథ ప్రచారంలో ఉంది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్​లో సమ్మక్క పుట్టిందనే మరో వాదన కూడా కొన్నాళ్లుగా వినిపిస్తోంది. చత్తీస్ గఢ్ లో పుట్టిందని, అక్కడి నుంచే మేడారానికి వచ్చిందని స్థానిక ఆదివాసీలు నమ్ముతుంటారు.

విశ్వాసాలే ఆధారాలు

సమ్మక్క తల్లి పుట్టింది బయ్యక్కపేటలోనా.. పొలవాసలోనా అనేది తేల్చడం కష్టమే. వందల ఏండ్లుగా ప్రచారమవుతూ వస్తున్న జానపద గాథలే తప్ప.. ఇందుకు సంబంధించి లిఖిత పూర్వక ఆధారాల్లేవు. ఆదివాసీల్లో ఒక తరం నుంచి మరొక తరానికి వంశపారంపర్యంగా వస్తున్న గాథలు, విశ్వాసాలే తల్లి పుట్టిన స్థలానికి సంబంధిం చిన ఆధారాలు. ఇప్పటివరకు ఉన్న జానపద గాథలను బట్టి ఈ రెండు ఊర్లలో ఏదో ఒక ఊరు సమ్మక్క తల్లి పుట్టిన ఊరు అయ్యి ఉండొచ్చు  
  - అరవింద్ ఆర్య, చరిత్ర పరిశోధకుడు