న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని పలు ప్రముఖ ఎయిర్ పోర్టుల్లో శుక్రవారం (నవంబర్ 7) సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)లో ఉపయోగించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. అయితే.. ఒకేసారి ఇలా ఉన్నట్టుండి ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సైబర్ ఎటాక్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎయిర్ పోర్టులపై సైబర్ ఎటాక్ జరిగినట్లు వినిపిస్తోన్న ఊహాగానాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ఎయిర్ పోర్టులపై ఎలాంటి సైబర్ ఎటాక్ జరగలేదని వివరణ ఇచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేస్తున్న క్రమంలో ఈ సమస్య తలెత్తినట్లు కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇది సాంకేతిక లోపమేనని.. సైబర్ భద్రతా ఉల్లంఘన కాదని స్పష్టం చేశాయి. ఎయిర్ పోర్టులపై ఎలాంటి సైబర్ దాడి జరగలేదని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ధృవీకరించారు. ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ సమస్య కారణంగా దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, అకాసా ఎయిర్ ఫ్లైట్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యంగా నడవగా.. మరికొన్ని పూర్తిగా రద్దు అయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాను సపోర్ట్ చేసే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్‌లోని సమస్య కారణంగా ఈ జాప్యం తలెత్తిందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. సాంకేతిక బృందాలు సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయని ఏఏఐ పేర్కొంది..
విమానాల ఆలస్యం, రద్దుతో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి ఎయిర్ పోర్టులోనే వెయిట్ చేయిస్తున్నారని సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
