Team India: రేపటితో (నవంబర్ 8) ఆస్ట్రేలియా టూర్‌కు ముగింపు.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదే!

Team India: రేపటితో (నవంబర్ 8) ఆస్ట్రేలియా టూర్‌కు ముగింపు.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదే!

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా మొదట మూడు వన్డేలు ఆడిన టీమిండియా 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ప్రస్తుతం టీ20 క్రికెట్ ఆడుతున్న మన జట్టు 2-1 ఆధిక్యంలో నిలిచారు. శనివారం (నవంబర్ 8) చివరి టీ20లో గెలిస్తే సిరీస్ 3-1 తేడాతో గెలుచుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే 2-2 తో సిరీస్ సమం అవుతుంది. ఆస్ట్రేలియాతో టూర్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఆడబోయే తదుపరి సిరీస్ పై ఆసక్తి నెలకొంది. 2025 సంవత్సరం ముగియడానికి రెండు నెలల సమయం ఉంది. ఈ రెండు నెలల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికాతో మూడు ఫార్మాట్ లు:  

ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిశాక వారం గ్యాప్ లో ఇండియా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా మూడు ఫార్మాట్ లు ఆడడానికి  ఇండియాలో పర్యటిస్తుంది. మూడు ఫార్మాట్ లలో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సుదీర్ఘ టూర్ లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్  న్యూఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో.. నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ జరుగుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఇరు జట్ల స్క్వాడ్ లను ప్రకటించారు.  

టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత ఇండియా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత జట్టులో చేరనున్నారు. వీరిద్దరూ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతుంది. తొలి మూడు వన్డేలకు వరుసగా రాంచీ, రాయ్‌పూర్,విశాఖపట్నం ఆతిధ్యమిస్తాయి. వన్డే మ్యాచ్ లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి.  

డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9 న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14 న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17 న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.