నెలలో రెండోసారి.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం

నెలలో రెండోసారి.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకల రేపింది.  ఎస్వీయూలోని పాపులేషన్ స్టడీస్ , ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలో చిరుత హల్ చల్ చేసింది.  నవంబర్ 7 అర్థరాత్రి 12: 47 నిముషాలకు సీసీ కెమెరాల్లో  చిరుతపులి సంచార దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చిరుత కుక్కను వేటాడుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.  చిరుత సంచారంతో వర్శిటీ సెక్యూరిటీ భయాందోళనకు గురవుతున్నారు.  విద్యార్థులు బయట ఒంటరిగా తిరగొద్దని హెచ్చరికలు జారీ చేశారు వర్శిటీ అధికారులు.

అక్టోబర్ 10న కూడా ఎస్వీ వర్శిటీ ఆవరణలో చిరుత సంచరించినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.  తరచూ ఇదే ప్రాంతంలో చిరుత కదలికలు కనిపిస్తున్న క్రమంలో భయంతో వణికిపోతున్నారు జనం. చిరుతలు అలిపిరి చెక్ పాయింట్ దగ్గర నుంచి ఎస్వీ యూనివర్సిటీలోకి ప్రవేశిస్తున్నాయని చెబుతున్నారు స్థానికులు.

చిరుత సంచారం పట్ల నిఘా పెట్టారు ఫారెస్ట్ సిబ్బంది. అలిపిరి చెక్ పాయింట్, ఎస్వీ యూనివర్సిటీ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. తరచూ చిరుత సంచరిస్తున్న క్రమంలో భయబ్రాంతులకు గురవుతున్నామని అంటున్నారు స్థానికులు. టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది చిరుత సంచారంపై నిఘా పెట్టి తమను రక్షించాలని కోరుతున్నారు స్థానికులు.