ఆస్ట్రేలియాతో జరగనున్న చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ కు టీమిండియా సిద్ధం అవుతోంది. శనివారం (నవంబర్ 8) బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదున్న టీమిండియా చివరి టీ20లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టీ20లో గెలిస్తే సిరీస్ 3-1 తేడాతో గెలుచుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే 2-2 తో సిరీస్ సమం అవుతుంది. ఈ మ్యాచ్ లో ఇండియా రిజర్వ్ ప్లేయర్లను పరీక్షించాలని కోరుకుంటుంది.
సిరీస్ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డిను ఆడించే ఆలోచనలో టీమిండియా ఉన్నట్టు ఆలోచిస్తుంది. రింకూ సింగ్ ఆసియా కప్ ఫైనల్లో ఆడాడు. హార్దిక్ పాండ్యకు గాయం కావడంతో రింకూకు ఫైనల్ ఆడే అవకాశం లభించింది. సిరీస్ ఎలాగో చేజారే అవకాశం లేదు కాబట్టి రింకూ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడుతూ గాయపడిన నితీష్ రెడ్డి పూర్తిగా కోలుకున్నాడు. వరల్డ్ కప్ ముందు నితీష్ కుమార్ కు పరీక్షించాలని జట్టు భావిస్తున్నట్టు సమాచారం.
శివమ్ దూబే, వాషింగ్ టన్ సుందర్ లకు రెస్ట్:
రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి చివరి టీ20లో ఆడితే శివమ్ దూబే, వాషింగ్ టన్ సుందర్ బెంచ్ కు పరిమితం కావాల్సి వస్తుంది. దూబే స్థానంలో రింకూ సింగ్ రానున్నాడు.అదే విధంగా సుందర్ స్థానంలో నితీష్ వస్తాడు. దూబే, సుందర్ ఇద్దరూ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్ లో 22 పరుగులు చేసిన దూబే..బౌలింగ్ లో టిమ్ డేవిడ్ వికెట్ తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. సుందర్ మూడు వికెట్లు పడగొట్టి కంగారులకు చుక్కలు చూపించాడు. మరో వరం రోజుల్లో సౌతాఫ్రికా సిరీస్ ఉండడంతో టెస్ట్ రెగ్యులర్ ప్లేయర్స్ గిల్, బుమ్రాలకు రెస్ట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
ఇప్పటికే సిరీస్ లో నాలుగు టీ20 మ్యాచ్ లు ముగిస్తే 2-1తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20 ఆదివారం (నవంబర్ 2) జరిగితే ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయంసాధించి 1-1 తో సమం చేసింది. గురువారం (నవంబర్ 6) జరిగిన నాలుగో టీ20లో ఇండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.
ఆస్ట్రేలియాతో ఐదో టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా)
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి , జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకు సింగ్ , అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్
