తమాషాలు చేస్తే.. తాట తీస్తా: ప్రైవేట్‌ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్

తమాషాలు చేస్తే.. తాట తీస్తా: ప్రైవేట్‌ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‎మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీ యజమాన్యాలు కాలేజీల బంద్‎కు పిలుపునివ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించమని.. తమాషాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదని.. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన డబ్బు మమ్మల్ని ఉన్న పళంగా ఇవ్వమంటే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. 

విడతల వారీగా ఫీజు రీయింబర్స్‎మెంట్ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రూ.3 వేల కోట్ల బకాయిలు ఉంటే.. రూ.6 వేల కోట్లు ఇవ్వమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్ తో ప్రైవేట్ కాలేజీలు ఆటలాడొద్దని హెచ్చరించారు. విద్యార్థుల పట్ల ఓవరాక్షన్ చేస్తే సహించేదని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులను ఇబ్బంది పెడ్తే.. ఏం చేయాలో మాకు కూడా తెలుసన్నారు. కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పరిశీలించేందుకు అధికారులు వెళ్తే తప్పా అని నిలదీశారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అడిగినవి ఇవ్వనందుకు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. 

స్కూళ్లు, కాలేజీలు బంద్ పెట్టి నిరసన చేస్తే సహించేదని వార్నింగ్ ఇచ్చారు. విద్య అంటే వ్యాపారం కాదని.. విద్య అంటే సేవ అని అన్నారు. కానీ ఒక్కో కాలేజీ విచ్ఛలవిడిగా ఫీజులు పెంచుకుని వచ్చాయని.. ఆ కాలేజీల ఫీజులు లిస్ట్ చూస్తే నేనే షాక్ అయ్యానని అన్నారు. నిబంధనల ప్రకారం కాలేజీలు నడపరు కానీ ఫీజులేమో కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజ్ రీయింబర్స్‎మెంట్‎పై విద్యార్థులను రెచ్చగొడుతున్నారని.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో మాకు తెలుసన్నారు. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారన్నారు.