నార్త్-ఈస్ట్ ఢిల్లీలో ముగ్గురిలో ఎవరు?

నార్త్-ఈస్ట్ ఢిల్లీలో ముగ్గురిలో ఎవరు?

న్యూఢిల్లీ: నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ లోక్‌సభ సెగ్మెంట్‌లో ట్రయాంగిల్‌ ఫైట్‌ నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి మూడుసార్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌, బీజేపీ నుంచి సీనియర్‌ నేత మనోజ్‌ తివారీ, ఆప్‌ నుంచి దిలీప్‌ పాండేలు బరిలో ఉండడంతో ఇది ఆసక్తికరంగా మారింది. ఈ ముగ్గురి భవితవ్యాన్ని ఓటర్లు ఈ నెల 12న డిసైడ్‌ చేయనున్నారు. డెవలప్‌మెంట్‌, అనధికార కాలనీలే ఈ సెగ్మెంట్‌లో క్యాండేట్ల గెలుపోటములను నిర్ణయించనున్నాయి. యూపీ, బీహార్‌ నుంచి వచ్చి స్థిరపడిన పూర్వాంచలీలు, ముస్లింలు, మైగ్రెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముస్లింలు, దళితులు, పేదవర్గాల ఓటు బ్యాంకుపై కాంగ్రెస్‌ ఆశలుపెట్టుకుంది. ఈ వర్గాలు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ వైపు మొగ్గారని, కానీ ఇచ్చిన హామీలను కేజ్రీవాల్‌ ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఇప్పుడు వారంతా తమవైపే చూస్తున్నారని భావిస్తోంది. 2013 వరకు ఏకంగా 15 ఏళ్లపాటు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ, ఢిల్లీ రాష్ట్ర పార్టీ చీఫ్‌ మనోజ్‌ తివారీతో పోటీపడుతున్నారు. ఇక ఆప్‌ నుంచి దిలీప్‌ పాండే తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సెగ్మెంట్‌లో 23 శాతం ముస్లిం జనాభా ఉంది. ముస్తఫాబాద్‌, సీలాంపూర్‌, ఘోండా అసెంబ్లీ సెగ్మెంట్లలో వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 1.43 కోట్ల మంది ఢిల్లీ ఓటర్లలో నార్త్‌ ఈస్ట్‌ సెగ్మెంట్‌లో 22.89 లక్షల మంది ఉన్నారు.

జనం ఏం కోరుకుంటున్నారు?

ఈ సెగ్మెంట్లలో 270 అనధికారిక కాలనీలు వెలిశాయి. వాటిలో దాదాపు 46 మురికివాడలున్నాయి. ఏళ్లుగా ఇక్కడ అభివృద్ధి కానరావడం లేదు. రోడ్లు, మంచినీళ్ల సమస్య ఉంది. ‘‘రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. నీళ్లు కూడా సరిగా లేవు. నల్లా నీళ్లు తాగే పరిస్థితి లేదు. బురారీ ఏరియాలో రోడ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్లపై దుమ్ము రేగుతుండటంతో పొల్యుషన్‌ పెరిగిపోతోంది’’ అని బురారీకి చెందిన సునీల్‌ త్యాగి చెప్పారు. తామొస్తే వీటన్నింటినీ సరిచేస్తామని షీలా చెబుతున్నారు. 1998, 2003, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో షీలా నేతృత్వంలో కాంగ్రెస్‌ గెలిచింది. 2013లో మాత్రం ఓటమిపాలైంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేదు. తనను గెలిపిస్తే మురికివాడల్లో పక్కా ఇళ్లు కట్టిస్తానని, బురారీ ఏరియాకు ఢిల్లీ మెట్రోను తెస్తానని బీజేపీ క్యాండేట్‌ మనోజ్‌ తివారీ చెబుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ ఢిల్లీకి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా ఇవ్వడమే పరిష్కారమని, అదే ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లామని ఆప్‌ నేత దిలీప్‌ పాండే తెలిపారు.