బీసీ కులగణన అప్పుడెందుకు గుర్తుకురాలే? : లక్ష్మణ్

బీసీ కులగణన అప్పుడెందుకు గుర్తుకురాలే? :   లక్ష్మణ్

ముషీరాబాద్,వెలుగు: బీసీలకు విద్యారంగంలో రిజర్వేషన్లు కల్పించి తన ప్రేమను ప్రధాని మోదీ చాటుకున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయని విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని కూడా చేశారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బీసీ కులగణన గుర్తుకురాలేదు? అని ప్రశ్నించారు. అధికారం పోయాక ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంగళవారం రాత్రి కవాడిగూడ, రాంనగర్ డివిజన్లలో ఓబీసీ మోర్చా సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కేటీఆర్ ని సీఎంను చేయాలని కేసీఆర్ పనిచేస్తున్నాడని, ఎంపీగా ఓడిపోయిన ఆయన బిడ్డను బ్యాక్ డోర్ నుంచి ఎమ్మెల్సీగా చేశాడని విమర్శించారు. మోదీని విమర్శించే వారంతా  కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారన్నారు. మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సదానంద్ ముదిరాజ్, పూసరాజు, పార్థసారథి, జమాల్పూర్ నందు, అరుణ్ కుమార్, మహేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.