మెున్న కొన్ని రోజుల కిందటి వరకూ గోల్డ్, సిల్వర్, కాపర్ అంటూ మెటల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం రూట్ మార్చేశారు. ఈటీఎఫ్ లు వద్దు ఈక్విటీలే ముద్దంటూ తిరిగి తమ పెట్టుబడుల ప్లాన్స్ మార్చేసుకున్నారు యుద్ధం వేళ. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు అసలు ఏం చేస్తున్నారు, దాని వల్ల ఎంత లాభం అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఫిబ్రవరి నెలలో భారత మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మళ్లీ ఈక్విటీల వైపు మొగ్గు చూపారు. మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కూడా పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ ఆధారిత ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం విశేషం. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం.. జనవరిలో రూ.24వేల 029 కోట్లుగా ఉన్న ఈక్విటీ ఇన్-ఫ్లోలు.. ఫిబ్రవరి నాటికి 8 శాతం వృద్ధితో రూ.25వేల 978 కోట్లకు చేరాయి. రిటైల్ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి పెడుతున్నారని ఇది రుజువు చేస్తోంది.
ఏ కేటగిరీలో ఎంత పెట్టుబడి?
ఈక్విటీ విభాగంలో అన్నిటికంటే ఎక్కువగా ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లలోకి రూ.6వేల 925 కోట్ల నిధులు వచ్చాయి. అయితే గత కొన్ని నెలలతో పోలిస్తే ఈ విభాగంలో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వృద్ధికి అవకాశం ఉన్న మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఫండ్లలోకి పెట్టుబడులు పెరగుతున్నాయి. ఫిబ్రవరిలో మిడ్-క్యాప్ ఫండ్లలోకి రూ.4వేల 003 కోట్లు, స్మాల్-క్యాప్ ఫండ్లలోకి రూ.3వేల 881 కోట్లు వచ్చాయి. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్లు కూడా ఊపందుకుని రూ.2వేల 987 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.
డెట్ మ్యూచువల్ ఫండ్ల విషయానికి వస్తే.. ఫిబ్రవరిలో రూ.42వేల 106 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా లిక్విడ్ ఫండ్లలోకి రూ.59వేల 077 కోట్ల భారీ నిధులు రాగా.. ఓవర్ నైట్ ఫండ్ల నుంచి రూ.14వేల 006 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. ఇన్వెస్టర్లు క్విక్ లిక్విడిటీ ఉన్న ఫండ్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బంగారం విషయానికి వస్తే.. జనవరిలో రూ.24వేల 040 కోట్లుగా ఉన్న గోల్డ్ ఈటీఎఫ్ ఇన్-ఫ్లోలు.. ఫిబ్రవరిలో రూ.5వేల 255 కోట్లకు తగ్గినప్పటికీ, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం ఇన్వెస్టర్లు బంగారంపై ఇంకా ఆసక్తిని కొనసాగిస్తున్నారు.
స్థిరంగా ఎస్ఐపీ ఇన్ ఫ్ల్సో..
మార్కెట్ గత కొన్నాళ్లుగా ఒకే పరిధిలో కదులుతున్నప్పటికీ, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా వచ్చే పెట్టుబడులు బలంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎస్ఐపీ కంట్రిబ్యూషన్ రూ.29వేల 845 కోట్లుగా నమోదైంది. జనవరిలో ఇది రూ.31వేల కోట్లుగా ఉంది. స్వల్ప మార్పు ఉన్నప్పటికీ.. సామాన్య ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ జనవరిలోని రూ.34.87 లక్షల కోట్ల నుంచి ఫిబ్రవరి నాటికి రూ.35.39 లక్షల కోట్లకు పెరిగాయి.
