ఉద్యోగాలిచ్చినం.. ప్రమోషన్లు ఇచ్చినం.. ఇండస్ట్రీలు తెచ్చినం.. మాకే ఓటెయ్యాలె
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినం. 35 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చినం. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినం. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నం. త్వరలో మరో 50 వేల జాబ్స్‌కు నోటిఫికేషన్లు ఇస్తం. ప్రైవేటు రంగంలోనూ టీఎస్ ఐపాస్ ద్వారా 15 వేల పరిశ్రమలకు పర్మిషన్లు ఇచ్చి, 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించినం. లాయర్లకు రూ. 100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినం. ఆరేండ్లలో 50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినం. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీకి ఓటేయాలి. గతంలో ఏ ప్రభుత్వాలైనా 43శాతం పీఆర్సీ ఇచ్చాయా? గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్‌లో బీజేపీ క్యాండిడేట్స్‌కు ఓటేస్తే ధరల పెంపును అంగీకరించినట్లే.
–కేటీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఉద్యోగాలియ్యలె.. పీఆర్సీ ఇయ్యలె.. జనం గోడు వింటలె.. మీకెందుకెయ్యా లె
ఆరేండ్లుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలే.. ఉద్యోగులకు పీఆర్సీ ఇయ్యలే.. జనం గోడు వింటలే.. మరి, టీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలే. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇస్తది. కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తడు. అందుకే మాకు ఓటెయ్యాలి. మేం గెలిస్తే ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాటం చేస్తం. కుటుంబ పాలనకు, నియంతృత్వ పోకడలకు చరమ గీతం పాడుతాం. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా సీఎం కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడటంలేదు. భైంసాలో పసిపాపపై అత్యాచారం జరిగితే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులు, ఉద్యమకారులు ఎటు పోయారు? తెలంగాణ ద్రోహులకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. సీఎం పదవి చెప్పుతో సమానమని కేసీఆర్ అనడమేంది? ఆయనకు అహంకారం తలకెక్కింది.
– బండి సంజయ్, బీజేపీ స్టేట్ చీఫ్
ఫామ్ హౌస్ దాటడు.. ప్రగతి భవన్లో కలవడు.. ఇంట్లోళ్లకే పదవులు.. మీకెట్ల ఓట్లేస్తరు?
ఈ ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కే పరిమితం. వరదలు వచ్చినా, కరోనాతో జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోడు. బయటకు రాడు. ఎవరినీ ప్రగతిభవన్‌లోకి రానియ్యడు. ఇలాంటి టీఆర్ఎసోళ్లకు గ్రాడ్యుయేట్లు ఎందుకు ఓటేస్తరు? తెలంగాణ ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ , ప్రొఫెసర్ కోదండరాం, నాయిని నర్సింహారెడ్డిని కేసీఆర్ అవమానపర్చిండు. ఇంట్లోళ్లకే పదవులు ఇచ్చుకుండు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తన బిడ్డకు కాకుండా పీవీ బిడ్డకు టికెట్ ఇచ్చిండు. ఓడిపోతే ఆ ఓటమిని పీవీ ఖాతాలో వేయాలని చూస్తున్నడు. పీవీని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధానిగా చేసి గౌరవించింది. అలాంటి వ్యక్తి పట్ల టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు అవమానపర్చేలా ఉంది. మోడీ, కేసీఆర్‌కు గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలని తెలంగాణ ఎదురుచూస్తోంది. లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి.
– రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
