ఢిల్లీ: నీట్- యూజీ–2026 అవకతవకలు, పేపర్ లీక్ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందిస్తూ.. ‘నీట్–2024 పేపర్ లీక్ అయింది, కానీ పరీక్షను రద్దు చేయలేదు. మంత్రి రాజీనామా చేయలేదు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఒక కమిటీని వేశారు. నీట్–2026 పేపర్ లీక్ అయింది. ఈసారి పరీక్షను రద్దు చేశారు. కానీ, మంత్రి ఇంకా రాజీనామా చేయలేదు. మళ్లీ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇంకో కమిటీని వేస్తారు.
మిస్టర్ మోదీ.. దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది- సమాధానం చెప్పండి.. పేపర్ లీక్‌లు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? ఈ పరీక్షా పేపర్ల చర్చపై మీరు ప్రతిసారీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పదే పదే విఫలమవుతున్న విద్యాశాఖ మంత్రిని ఎందుకు తొలగించడం లేదు?’ అని ప్రశ్నించారు.
పరీక్ష రద్దు కావడంతో మనస్తాపానికి గురై ఉత్తరప్రదేశ్‌లో 21 ఏండ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ‘ఇలాంటి యువకులు పరీక్షల్లో ఓడిపోలేదు.. అవినీతి వ్యవస్థ చేతిలో హత్యకు గురయ్యారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
