ఆర్గానిక్​ వైపు నడిపిస్తున్న ఆలుమగలు

ఆర్గానిక్​ వైపు నడిపిస్తున్న ఆలుమగలు

ఆమె ఎమ్మెస్సీ ఆర్గానిక్​ కెమిస్ట్రీ చదివింది. అతను ఇంజినీర్​. కానీ, ప్యాండెమిక్​ వాళ్లని ఊరి బాట పట్టించింది. వర్క్​ ఫ్రమ్​ హోం వ్యవసాయం వైపు అడుగులు వేయించింది. కెమికల్స్​ లేకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో  పంటలు సాగు చేస్తున్నారు వీళ్లు. సజ్జలు, జొన్నలు, రాగులు, అరికెలు లాంటి  మిల్లెట్స్​తో పాటు ఐదు రకాల దేశీ వరి వంగడాలు పండిస్తున్నారు. అంతేకాదు కెమికల్స్​తో నిండిన మందుల వల్ల పంటలకి జరుగుతున్న నష్టాల్ని యూట్యూబ్​ వీడియోల్లో చెప్తున్నారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా విజయనగరంకి చెందిన  మాదాను సునంద,  రవి  గురించి మరిన్ని విషయాలు. 

భూమిని భూమే కాపాడుకుంటుందని చెప్తున్న ఈ భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ కుటుంబంలోనే పుట్టారు. చిన్నప్పట్నించీ రైతుల కష్టాల్ని.. కెమికల్స్​తో నిండిన మందుల వల్ల జరుగుతున్న నష్టాల్ని దగ్గర్నుంచి చూశారు. కానీ, చదువులు,  ఉద్యోగాల వల్ల   సొంతూరిని వదిలి సిటీకొచ్చారు. అయితేనేం వీళ్ల మనసులు మాత్రం ఎప్పుడూ పచ్చని పొలాల చుట్టూరానే  తిరుగుతుండేవి. దాంతో సాగుకి సంబంధించిన బుక్స్​ బాగా చదివేవాళ్లు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసి సక్సెస్​ అయిన రైతులతో మాట్లాడేవాళ్లు. వీకెండ్స్​లో ​ సిటీ చుట్టుపక్కలున్న ఊళ్లకెళ్లి  నేచురల్​ ఫార్మింగ్​ గురించి రీసెర్చ్​ చేసేవాళ్లు. ప్రాక్టికల్​ నాలెడ్జ్​ వచ్చాక వ్యవసాయం చేయాలన్నది వీళ్ల ఆలోచన. దానికి వర్క్​ ఫ్రమ్​ హోం కలిసొచ్చింది.

కాన్ఫిడెన్స్​ పెరిగింది
వర్క్ ఫ్రమ్​ హోం వల్ల హైదరాబాద్​ నుంచి సొంత ఊరికి వచ్చేశారు సునంద, రవి. దాంతో మళ్లీ వ్యవసాయం వైపు అడుగులు పడ్డాయి. కానీ, ప్రాక్టికల్​ నాలెడ్జ్​ లేకపోవడంతో మొదట తడబడ్డారు. విత్తనం నాటడం దగ్గర్నించి ఏ పంటకి, ఎన్ని రోజులకు తడి పెట్టాలి? ఎప్పుడు మందులు కొట్టాలి?  అనే విషయాలపై దృష్టి పెట్టారు.  తరువాత సుభాష్​ పాలేకర్​ ​పద్ధతిలో రెండు కుంటల్లో నవరా వరి సాగు చేశారు. దిగుబడి బాగా రావడంతో కాన్ఫిడెన్స్​ వచ్చింది. మరిన్ని పంటలు సాగు చేయాలనుకున్నారు. కానీ, ఆలోపే వాళ్ల ఇంటి పెరట్లోని గోంగూర చెట్లన్నీ పిండినల్లి వచ్చి చనిపోవడం గమనించింది సునంద. కానీ, వాటిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. ఆ టైంలో ఆఖరి ప్రయత్నంగా సీవీఆర్​( చింతల వెంకట్​ రెడ్డి) పద్ధతిలో  నల్లమట్టి కలిపిన నీళ్లని ఆ మొక్కలపై పోసింది. తెల్లారి చూస్తే పండినల్లి అంతా రాలిపోయి,  చెట్లు ఫ్రెష్​గా కనిపించాయి. ఇక అప్పట్నించీ సీవీఆర్​ పద్ధతిలో సాగు చేయడం మొదలుపెట్టారు.

ఐదు  రకాల వరి
తమకున్న 8 ఎకరాల భూమిలో  3 ఎకరాల్లో  ఇంద్రాణి, కుజూ పటాలియా, కాలాబట్టి, నవార, మాప్పిళ్లై సాంబ లాంటి దేశీయ వరి రకాలు వేశారు వీళ్లు. మరో మూడు ఎకరాల్లో సోయాబీన్స్, రెండు ఎకరాల్లో కంది సాగుచేస్తున్నారు. అంతర పంటలుగా సజ్జ, కొర్ర, రాగులు వేశారు. ఈ పంటలన్నింటికీ కెమికల్స్​తో పనిలేకుండా మట్టి, ఆముదం, మొలకల ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఎకరా పంటకు ముప్పై కేజీల నల్ల మట్టి, అరకిలో ఆముదం, రెండు కిలోల గోధుమ మొలకల రసం, రెండు కేజీల పండు లేదా పచ్చిమిర్చి రసం, అరకిలో అల్లం, వెల్లుల్లి, రెండుకిలోల కర్ర బూడిద, అయిదు కేజీల సన్నని  కంకర డస్ట్ కలిపి పంటకు చల్లితే వారంలోనే చీడపీడలు బెడద పోతుందంటున్నారు వీళ్లు. 

తయారీ ఇలా.. 
భూమిని మూడు ఫీట్ల లోతుకు తవ్వి ఇరవై కిలోల నల్ల మట్టి  తీయాలి. దానిని బెడ్డలు లేకుండా చేసి ఎండబెట్టాలి. ఒకవేళ ఎర్ర మట్టి అయితే ముప్పై కిలోల  వరకు తీసుకోవాలి. ఎండిన మట్టిలో  ఆముదం వేసి బాగా కలపాలి. తర్వాత వారం రోజుల వయసు ఉన్న  గోధుమ మొలకలను అందులో వేయాలి. పండు లేదా పచ్చి మిర్చి రసంతో పాటు  అల్లం,  వెల్లుల్లి రసం, కర్ర బూడిద, కంకర డస్ట్  వేయాలి. వీటన్నింటినీ రెండు వందల లీటర్ల  నీళ్ల డ్రమ్ము లో కలపాలి.  ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత తామర తెగులు సోకిన పంట పై స్ప్రే చేయాలి. మంచి రిజల్ట్ కోసం వారానికి రెండు సార్లు స్ప్రే చేయాలి. ఆముదం యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరస్, యాంటిఫంగల్​గా పనిచేస్తుంది. అలాగే ఆముదం వాసనకి మిగతా పురుగులు రావు. తామరతో పాటు ఎటువంటి తెగుళ్లు సోకినా కొద్దిగా అటు ఇటుగా  ఇదే పద్ధతిలో ఫాలో అవొచ్చు అంటున్నారు ఈ జంట​. డి. మహేశ్వర్​ప్రసాద్​, కాగజ్​నగర్​, వెలుగు

ఛానెల్​తో ప్రచారం
ఇంత చదువులు చదువుకుని వ్యవసాయం ఎందుకని చాలామంది అడిగారు మమ్మల్ని. అసలు కెమికల్స్​ లేకుండా వ్యవసాయం ఏంటని ఎదురు ప్రశ్నించారు. ఒకానొక టైంలో మేం కూడా ఆశలన్నీ వదిలేసుకున్నాం. తిరిగి సిటీకి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ, మేము తిరిగి వెళ్తే .. మాలాగా వ్యవసాయం వైపు రావాలనుకునే వాళ్లు ధైర్యం చేయలేరు. అందుకే అలాంటి వాళ్లకి మేము ఒక ఎగ్జాంపుల్​ అవ్వాలనుకున్నాం. అందులో కొంతమేర సక్సెస్​ అయ్యాం కూడా. రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించేం దుకు ‘సు’ నందనమ్​ నేచురల్​ ఫార్మ్స్ ( SU Nandanam natural farms) ​ అనే యూట్యూబ్ ఛానెల్​  కూడా నడుపుతున్నాం. దానిద్వారా పంటలకొచ్చే వివిధ రకాల తెగుళ్ల నుంచి నేచురల్​గా పంటల్ని ఎలా కాపాడుకో వాలో చెప్తున్నాం. అలాగే ఇంటి పంటలపైనా అవేర్​నెస్​ కల్పిస్తున్నాం. ఫ్యూచర్​లో మరింత మందిని ఆర్గానిక్​ వ్యవసాయం వైపు నడిపించాలన్నదే  మా ఆలోచన అంటున్నారు ఈ భార్యాభర్తలు.