మ్యాచ్ అంటే ఇదీ.. విన్నర్ ఒకరే- కానీ ఛాంపియన్స్ ఇద్దరు

మ్యాచ్ అంటే ఇదీ.. విన్నర్ ఒకరే- కానీ ఛాంపియన్స్ ఇద్దరు

ఇంగ్లండ్ లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ జనాలకు ఎంత వినోదం పంచాయన్నది పక్కన పెడితే.. వాటన్నింటినీ మించిన వినోదం.. క్రికెట్ లోని మజా… ఒక్క ఫైనల్ మ్యాచ్ గంపగుత్తగా అభిమానులకు అందించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 8 వికెట్లకు 241 రన్స్ చేస్తే.. ఇంగ్లండ్ జట్టు కూడా అద్భుతమైన పోరాటం చూపి.. 50 ఓవర్లలో 241 రన్స్ కు ఆలౌట్ అయింది. ఒత్తిడిలో ఉన్న ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను.. బెన్ స్టోక్స్, బట్లర్ తమ భుజాలపై మోసి… గెలుపు వాకిట్లోకి తీసుకొచ్చారు.

ఇంగ్లండ్ పరుగుల ఆరాటం.. న్యూజీలాండ్ కళ్లుచెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు.. వెరసి… అద్భుతమైన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు వినోదం పంచింది. ఫైనల్ మ్యాచ్ చేజింగ్ లో.. చివరి 10 ఓవర్ల ఆటే అత్యంత కీలకం. బాల్స్ తక్కువ.. చేయాల్సిన పరుగులు ఎక్కువ. చివరి ఓవర్లో ఐతే… 15 రన్స్ కావాలి. కొట్టేసత్తా ఉన్న ఆటగాడు స్టోక్స్ ఒక్కడే ఉన్నాడు. అప్పుడు స్టోక్స్ చేసిన మ్యాజిక్ చూడాల్సిందే. మ్యాచ్ టైగా ముగిసి.. సూపర్ ఓవర్ జరిగింది. అప్పటిదాకా ఆడిన స్టోక్స్, బట్లర్ అలసట ఫీలవ్వకుండా ..ఇంగ్లండ్ తరఫున బ్యాటింగ్ కు దిగారు. 2 ఫోర్లతో 15 రన్స్ చేసింది ఇంగ్లండ్. తర్వాత న్యూజీలాండ్ తరఫున నీషమ్, గప్తిల్ బ్యాటింగ్ కు దిగారు. 1 సిక్సర్ సాయంతో 15 పరుగులే చేశారు. సూపర్ ఓవర్ కూడా టై. న్యూజీలాండ్ బౌలర్ బౌల్ట్ తన బౌలింగ్ లో 2 ఫోర్లు ఇచ్చాడు. కానీ.. ఇంగ్లండ్ బౌలర్ ఆర్చర్ ఒక సిక్సర్ మాత్రమే ఇచ్చాడు. అంతే.. బౌండరీల లెక్కన ఇంగ్లండ్ విజేత అయ్యింది.

ఐతే.. న్యూజీలాండ్ పోరాటం ఆ జట్టును కూడా అభిమానుల మనసులో ఛాంపియన్ గా నిలబెట్టింది. కేన్ విలియంసన్ స్ఫూర్తిదాయకమైన కెప్టెన్సీ.. కెప్టెన్ గా ఆయన ఆడిన సూపర్ ఇన్నింగ్స్ లు.. జట్టును నడిపించిన విధానం.. ప్లేయర్ల పోరాటం.. న్యూజీలాండ్ ను ఛాంపియన్ ను చేశాయి.

అసలు రెండు జట్లను విజేతగా ప్రకటించాల్సింది అని మెజారిటీ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు క్రికెట్ గెలిచేది అని చెబుతున్నారు. కానీ.. క్రికెట్ లో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్ ప్రకారం.. ఒక్కరే విజేత అవ్వాలి. బౌండరీలతో వచ్చిన పరుగుల ఆధారంగా ఇంగ్లండ్ కప్పును ఎగరేసుకుపోయింది.  రీప్లేలో ఎన్నిసార్లు చూసినా కూడా  బోర్ కొట్టదేమో. అసలు ఈ మ్యాచ్ ను లైవ్ లో చూస్తే వచ్చే కిక్కే వేరు. అది మాటల్లో వర్ణించేది కూడా కాదు.