కాంగ్రెస్ లేకుంటే.. అరవింద్ లేడు..తండ్రిచాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చావ్: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కాంగ్రెస్ లేకుంటే.. అరవింద్ లేడు..తండ్రిచాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చావ్: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • స్వయం కృషితో సీఎం అయిన రేవంత్​పై విమర్శలా అంటూ ఫైర్​

హైదరాబాద్​: బీజేపీ, బీఆర్​ఎస్​బంధం గల్లీలో కుస్తీ... ఢిల్లీలో దోస్తీలా మారిందని ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి, కాంగ్రెస్​పార్టీపై ఎంపీ అరవింద్​చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు. అసలు అరవింద్ ఒరిజనల్​బీజేపీ కాదని, కాంగ్రెస్​ పార్టీ లేకుంటే ఆయన లేడని అన్నారు. డీఎస్​కాంగ్రెస్​పార్టీకి ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకుడని,  ఆయనంటే మాకు గౌరవం, అభిమానం ఉందని, ఆయన లేకపోతే మీరెక్కడ అని అరవింద్​ను ప్రశ్నించారు.

తండ్రిచాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్... కాంగ్రెస్​పార్టీకి సేవలు చేయాల్సి పోయి, బీజేపీకి అరువుకు వెళ్లారని ఆరోపించారు. స్వయం కృషితో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్​రెడ్డి ని విమర్శించే నైతిక హక్కు అరవింద్​కు లేదన్నారు. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవతంలో స్వయం కృషితో రేవంత్​రెడ్డి తెలంగాణ ప్రజల మన్ననలు పొందారన్నారు.  ప్రజాస్వామ్య పంథాలో మీ రెండు పార్టీల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి ముఖ్యమంత్రి అయిన రేవంత్​రెడ్డి సత్తా ... మీకు ప్రధాని మోదీకి కూడా తెలుసునని అన్నారు.

రేవంత్​రెడ్డి పార్టీ మారింది తెలుసు.. ప్రజా క్షేత్రంలో పోరాడి తెలంగాణలో కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రావడానికి కారణమని తెలియాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని,  ఇప్పటికే ఐదు పథకాలను అమలు చేశామన్నారు. మరో పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని, లేదంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.