- కరిచిన పైభాగంలో తాడుతో కట్టి దవాఖానకు..
- అయినా ప్రాణాలు దక్కలే
- జవహర్ నగర్ బాలాజీనగర్ లో ఘటన
జవహర్ నగర్, వెలుగు: ఎండాకాలం వేడికి ఇంట్లో ఉండలేకపోతున్నామని తలుపు తెరిచి పెట్టి పడుకోగా, లోపలకు వచ్చిన పాము కాటేసి ఒకరి ప్రాణాలను తీసింది. జవహర్ నగర్ పీఎస్పరిధిలోని బాలాజీనగర్ కు చెందిన సద్దాం హుస్సేన్, భార్య ఖాతూన్ (29), ముగ్గురు బిడ్డలతో కలిసి ఉంటున్నారు. ఈ నెల18న రాత్రి భోజనం చేసిన తర్వాత కుటుంబసభ్యులంతా ఇంట్లో పడుకున్నారు. వేడి ఎక్కువగా ఉండడంతో ఇంటి ముందు తలుపు తెరిచి కూలర్ ఆన్ చేసి నిద్రపోయారు. తెల్లవారుజామున ఖాతూన్ అకస్మాత్తుగా అరిచింది.
‘నా ఎడమ చేయి వేళ్లపై ఏదో కాటేసింది’ అని ఏడ్వసాగింది. వెంటనే లేచిన సద్దాం హుస్సేన్ లైట్వేయగా, పాము కనిపించింది. దీంతో పిల్లలను దూరంగా పంపించాడు. తర్వాత పామును కర్రతో కొట్టి చంపాడు. కాటేసిన వేళ్ల పైభాగంలో తాడు కట్టి ఓ ప్రైవేట్హాస్పిటల్కు, అక్కడి నుంచి బాలాజీనగర్ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాడు. డాక్టర్లు ఫస్ట్ఎయిడ్చేసి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు రెఫర్చేశారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది.
