బండ్లగూడలో హిట్ అండ్ రన్ కేసు... స్కూటీని ఢీకొట్టిన లారీ

బండ్లగూడలో హిట్ అండ్ రన్ కేసు... స్కూటీని ఢీకొట్టిన లారీ

ఓల్డ్​సిటీ, వెలుగు: ఓల్డ్​ సిటీలోని బండ్లగూడ చౌరస్తాలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. స్కూటీని లారీ ఢీకొట్టి వెళ్లిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె భర్త, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన ఫాతిమా బేగం (25) తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్లింది. తిరిగి వస్తుండగా, బండ్లగూడ చౌరస్తాలోని యూటర్న్ వద్ద వీరి స్కూటీని ఓ లారీ బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫాతిమా బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, స్కూటర్ నడుపుతున్న ఆమె భర్తకు, ఇద్దరు చిన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీఫుటేజీ ఆధారంగా లారీ డ్రైవర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్​స్పెక్టర్ దేవేందర్ తెలిపారు.

యూటర్న్‌‌‌‌‌‌‌‌ క్లోజ్ చేయించిన ఎమ్మెల్యే

ప్రమాదం జరిగిన విషయం తెలియగానే చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిని కోల్పోయి దిగ్భ్రాంతిలో ఉన్న పిల్లలను, భర్తను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదానికి కారణమైన ఆ యూటర్న్ వద్ద తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన ఎమ్మెల్యే.. వెంటనే పోలీసులతో మాట్లాడి మూసివేయించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.