- జూన్2 కల్లా రాష్ట్రంలో మరో 39 చోట్ల ప్రారంభానికి ఏర్పాట్లు!
- నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల స్ఫూర్తితో మరిన్ని జిల్లాలకు విస్తరణ
- బంకుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా పెట్రోల్ బంకుల నిర్మాణాలు రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుపై అధికారులు తాజాగా మంత్రి సీతక్కకు సమగ్ర నివేదిక సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్‌కు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థల సహకారంతో భూముల గుర్తింపు, లీజు ఒప్పందాలు, ఎన్‌ఓసీలు, లేఅవుట్లు, అడ్వాన్స్ పొజిషన్, ట్యాంకుల ఇన్‌స్టాలేషన్ వంటి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
ప్రతి నెలా సుమారు రూ.7 లక్షల ఆదాయం..
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని హకీంపేట గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నిర్మాణ పనులు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. అక్కడ ఇంధన ట్యాంకుల ఇన్‌స్టాలేషన్ పనులు కొనసాగుతున్నాయి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ప్రస్తుతం మరో 39 ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంకుల నిర్మాణం కూడా పూర్తయ్యేలా చూడాలన్నారు. నల్గొండ జిల్లా గందవారిగూడెంలో ట్యాంకుల ఏర్పాటు పూర్తయ్యింది. పెద్దపల్లి జిల్లా భూపతిపురంలో ట్యాంకుల ఇన్‌స్టాలేషన్ పూర్తయింది.
ఆదిలాబాద్, వికారాబాద్, వనపర్తి, ఖమ్మం, కుమ్రం భీం, హనుమకొండ జిల్లాల్లో భూమి లెవలింగ్, నిర్మాణ కార్యాకలాపాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అవసరమైన అన్ని ఎన్‌ఓసీలు పూర్తికాగా, కామారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో లీజు ఒప్పందాలు, తుది అనుమతుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే నారాయణపేట, సంగారెడ్డిలో జిల్లా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో మహిళా పెట్రోల్ బంకులు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ బంకుల ద్వారా పది మందికి పైగా మహిళలకు ఉపాధి లభించడంతోపాటు ప్రతి నెలా సుమారు రూ.7 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది
