మా కాలనీల్లో వైన్​ షాపులొద్దు: హైదరాబాద్ లో నిరసనలు

మా కాలనీల్లో వైన్​ షాపులొద్దు: హైదరాబాద్ లో నిరసనలు

హైదరాబాద్ లో పలు చోట్ల నిరసనలు
పార్సిగుట్టలో మహిళలపై దాడిచేసిన వైన్ షాప్ ఓనర్లు
ఒక మహిళ తలకు తీవ్రగాయం

ఇండ్ల మధ్య, కాలేజీలు, ఆలయాల పక్కనే మద్యం షాపులు ఏర్పాటుచేయడాన్ని నిరసిస్తూ మహిళలు పోరుబాట పట్టారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో తెరుచుకున్న మద్యం దుకాణాల ముందు ధర్నాకు దిగారు. ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్న కాలనీల మధ్య మద్యం షాప్​లకు ఎలా రెన్యువల్​ ఇచ్చారని భాగ్యనగర్​ కాలనీవాసులు ప్రశ్నించారు. మహిళలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం భాగ్యనగర్​ కాలనీలో ఉన్న వైన్స్​ ఎదుట శుక్రవారం మహిళలు, కాలనీవాసులు బైఠాయించారు. వైన్స్​ ఎత్తివేయాలని, లేకపోతే నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు.

కాలనీలో సాయిబాబా గుడి పక్కన కృష్ణవేణి కాంప్లెక్స్​లో రెండు సంవత్సరాలుగా వైన్​ షాపు నడుస్తున్నది. ఇదే కాంప్లెక్స్​లో ఎన్​ఆర్​ఐ కాలేజ్​ ఉండేది. మద్యం షాప్​లో జరిగే లొల్లితో కాలేజ్​ను ఇక్కడ నుంచి తరలించారు. పర్మిట్​ రూం ఉన్నా కూడా చాలామంది రోడ్డుపైనే తాగి అక్కడే తిని,  చివరకు మూత్ర విసర్జన కూడా చేస్తున్నారు. ఇక్కణ్నుంచి వైన్స్​ షాప్​ ఎత్తేయాలంటూ ఆరు నెలలుగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు మంత్రి కేటీఆర్​ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ సారి టెండర్లలో వైన్​ షాపును తీసేయిస్తామని హామీ కూడా ఇచ్చారని, అలాంటిది రెన్యువల్​లో మళ్లీ కొత్తవారికి ఇదేచోట పర్మిషన్​ ఇచ్చారని కాలనీవాసులు తెలిపారు. కాలనీ అధ్యక్షుడు కేఆర్​ చౌదరి మాట్లాడుతూ కొద్దిరోజుల కిందట భార్యతో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా ఓ తాగుబోతు గోల్డ్​ చైన్​ లాక్కుపోయాడని గుర్తుచేశారు.

అయ్యప్ప స్వాముల ధర్నా

కూకట్​పల్లి నియోజకవర్గ పరిధిలోని కేపీహెచ్​బీ కాలనీ మంజీర మాల్​ పక్కన ఉన్న పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో వైన్​షాపును తొలగించాలంటూ ఆలయ కమిటీ, కాలనీవాసులు, అయ్యప్ప దీక్షాపరులు ధర్నాకు దిగారు. పోచమ్మ ఆలయ ప్రాంగణంలోనే అయ్యప్ప భక్తుల శిబిరం ఉంది. వైన్​షాపు వల్ల గుడికి వచ్చే అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆలయ కమిటీ తెలిపింది. ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటికి రాలేనంత దారుణంగా పరిస్థితి తయారైందని స్థానికులు చెప్పారు.  పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వైన్స్​ను మూసేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి