టార్గెట్ కు చేరువలో ధాన్యం కొనుగోళ్లు..గతేడాదిని మించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

టార్గెట్ కు చేరువలో ధాన్యం కొనుగోళ్లు..గతేడాదిని మించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
  • రైతుల ఖాతాల్లో రూ.14,500 కోట్లకు పైగా జమ
  • 11 లక్షల మంది రైతులకు అందిన వడ్ల పైసలు
  • ఆరు వేలకు పైగా సెంటర్లలో కొనుగోళ్లు పూర్తి 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఈ సారి యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే 16 జిల్లాల్లో కొనగోళ్లు పూర్తి కాగా.. మరో 16 జిల్లాల్లో స్వల్పంగా కొనసాగుతున్నాయి.

యాసంగి నాట్లు లేట్​గా వేసిన నాగర్​ కర్నూల్, వనపర్తి, వికారాబాద్, భూపాలపల్లి, ములుగు తదితర జిల్లాల్లోనే కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. సివిల్​ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 74.10 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోళ్లు జరిగాయి. కొనుగోళ్లలో 60 లక్షలకు పైగా దొడ్డు వడ్లు కాగా, మరో 13.50 లక్షలు మాత్రమే సన్నవడ్లు సేకరణ జరిగింది. గతేడాది నమోదైన 72.22 లక్షల టన్నుల కొనుగోళ్లను ఈయేడు ఇప్పటికే అధిగమించారు.

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల టార్గెట్​ 75 లక్షల టన్నులు త్వరలో పూర్తి కానున్నాయి.  కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి  11 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.14,500 కోట్ల వరకు  ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 6 వేల కేంద్రాల్లో (70 శాతం) కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగిలిన కేంద్రాల్లోనూ వేగంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. అధికారుల అంచనాల ప్రకారం ఒకటి రెండు రోజుల్లో  ధాన్యం కొనుగోళ్లు పూర్తికానున్నాయి.

ఇప్పటికే దాదాపు సగానికిపైగా జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు సివిల్​ సప్లయ్స్​ శాఖ వర్గాలు వెల్లడించాయి. రైతులు కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని వేగంగా తూకంవేసి, మిల్లులకు తరలించే చర్యలు చేపడుతున్నారు. అదే సమయంలో రైతులకు చెల్లింపులు కూడా జాప్యం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

ఈ సారి పెరిగిన దిగుబడి

ఈ యాసంగి సీజన్‌‌లో అనుకూల వాతావరణ పరిస్థితులు, అధిక దిగుబడులతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగింది. ఫలితంగా ధాన్యం కొనుగోళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో ధాన్యం సేకరణ జరగడం రైతాంగానికి ఊరటనిచ్చే అంశంగా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ధాన్యం తరలింపు, గన్నీ బ్యాగుల సరఫరా వంటి అంశాల్లో సమన్వయంతో వ్యవహరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ  కొనుగోళ్లు త్వరలో పూర్తికానున్నాయని అధికారులు అంటున్నారు.