‘శతశాతం’తో విద్యలో విప్లవం: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

‘శతశాతం’తో విద్యలో విప్లవం: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా శతశాతం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్  ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్  ఫస్ట్  ఆధ్వర్యంలో వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆట(అమెరికా తెలుగు అసోసియేషన్) కమ్యూనిటీ సర్వీస్  అవార్డు రావడం గర్వకారణమని తెలిపారు. 

ఇది సమిష్టి కృషి ఫలితమని చెప్పారు. గవర్నమెంట్​ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేపట్టిన ఈ కార్యక్రమానికి అనేక మంది స్వచ్ఛందంగా సహకరించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. తన సొంత నిధులతో పాటు విద్యాశాఖ సహకారంతో వంద మంది విద్యా వాలంటీర్లకు మూడు రోజుల శిక్షణ అందించినట్లు తెలిపారు. 

వాలంటీర్లు తమకు కేటాయించిన స్కూళ్లలో శతశాతం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అంతకుముందు ఆట సంస్థ నుంచి అవార్డు తీసుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేను కాంగ్రెస్  శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు శాలువా కప్పి, బొకేలు అందజేసి సత్కరించారు. నగర మేయర్  గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్  మారేపల్లి సురేందర్ రెడ్డి, నేతలు వినోద్ కుమార్, ఎన్పీ  వెంకటేశ్  పాల్గొన్నారు.