పెద్ద వాళ్లకు అవసరమయ్యే హెల్త్​ గాడ్జెట్స్‌

పెద్ద వాళ్లకు అవసరమయ్యే హెల్త్​ గాడ్జెట్స్‌

ఇంట్లో చిన్నపిల్లలే కాదు.. పెద్దవాళ్లను కూడా ఎప్పుడూ ఓ కంట కనిపెట్టాలి. వాళ్ల చిన్న చిన్న అవసరాలను తీర్చే గాడ్జెట్స్‌‌ కొనిస్తుండాలి. ముఖ్యంగా వాళ్ల హెల్త్ మీద కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. పెద్ద వాళ్లకు అవసరమయ్యే హెల్త్​ గాడ్జెట్స్‌‌ కొన్ని.. 

ట్యాబ్లెట్‌‌ ఆర్గనైజర్‌‌‌‌
వయసుపైబడిన వాళ్లలో చాలామంది రోజూ టాబ్లెట్స్‌‌ వేసుకోవాల్సిన పరిస్థితి. షుగర్‌‌‌‌, బీపీ లాంటి సమస్యలు ఉన్నవాళ్లకు ట్యాబ్లెట్స్ వేసుకోవడం డైలీ రొటీన్​. అలాంటి వాళ్లు మూడు పూటలా.. వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్‌‌ని గుర్తుంచుకోవడం కాస్త కష్టమే. పైగా ఒక్కోసారి ట్యాబ్లెట్‌‌ వేసుకుని మర్చిపోయి, మళ్లీ వేసుకుంటుంటారు. అలాంటివాళ్లు పిల్‌‌ ఆర్గనైజన్‌‌ వాడితే సరిపోతుంది. ఇవి రకరకాల మోడల్స్‌‌లో దొరుకుతున్నాయి. కొన్నింటిలో ఏడు రోజులు, మూడు పూటలకు ప్రత్యేకంగా గడులు ఉంటాయి. వాటిలో వారానికి సరిపడా ట్యాబ్లెట్స్ నింపుకుంటే సరిపోతుంది. ఇంకొన్ని నెలకు సరిపడా గడులతో వస్తున్నాయి. మరికొన్నింటికి అలారం ఫీచర్‌‌‌‌ కూడా ఉంటుంది. ఈ గాడ్జెట్‌‌ చుట్టూ 30 గడులు ఉంటాయి. ట్యాబ్లెట్‌‌ ఎప్పుడు వేసుకోవాలనేది సెట్‌‌ చేస్తే.. రోజూ ఆ టైంకి అలారం మోగుతుంది. డబ్బా తెరిచే వరకు మోగుతూనే ఉంటుంది. ట్యాబ్లెట్స్‌‌ వేసుకోవడం మర్చిపోయేవాళ్లకు ఇది బెస్ట్‌‌ ఆప్షన్‌‌. 
ధర: సైజు, ఫీచర్స్‌‌ని బట్టి 160 నుంచి 12,000 రూపాయల వరకు.

పిల్‌‌ కట్టర్ 
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, రోజూ ట్యాబ్లెట్లు వేసుకునే పెద్దవాళ్లు ఉన్నా ఈ పిల్‌‌ కట్టర్ బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్లు ఒక్కోసారి సగం ట్యాబ్లెట్‌‌ వేయాలని చెప్తుంటారు. అప్పుడు టాబ్లెట్‌‌ కట్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పెద్దవాళ్లకు కూడా కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌‌కి రోజు తప్పి రోజు డోసేజ్ తగ్గిస్తూ టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ పిల్‌‌ కట్టర్‌‌‌‌ వాడితే టాబ్లెట్‌‌ని ఈజీగా కట్‌‌ చేయొచ్చు. కొన్ని పిల్‌‌ కట్టర్స్‌‌లో ట్యాబ్లెట్స్‌‌ స్టోరేజ్​ స్పేస్‌‌ కూడా ఉంటుంది.  
ధర: 150 రూపాయల నుంచి మొదలు

పానిక్ బటన్లు
పెద్దవాళ్లకు అనారోగ్య సమస్యలు ఉంటే ఇంట్లో కచ్చితంగా ఈ పానిక్ బటన్లు పెట్టించుకోవాలి. గార్డెన్​లో కూర్చున్నప్పుడో, దాబా మీద ఒంటరిగా ఉన్నప్పుడో హార్ట్‌‌ స్ట్రోక్ వస్తే.. గట్టిగా అరిచి పిలవలేరు. ఒకవేళ అరిచినా ఇంట్లో ఉన్న వాళ్లకు వినపడకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ల దగ్గరున్న ఈ పానిక్‌‌ బటన్‌‌ నొక్కితే ఇంట్లో ఉన్న అలారం మోగుతుంది. మార్కెట్‌‌లో చాలా రకాల పానిక్ బటన్లు ఉన్నాయి. 
ధర: 2,000  రూపాయల నుంచి మొదలు 

హార్ట్ రేట్ మానిటర్
ఈ రోజుల్లో ఏ జబ్బు ఎప్పుడు? ఎలా? వస్తుందో తెలియడంలేదు. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వాళ్ల హెల్త్‌‌ మీద స్పెషల్‌‌ కేర్‌‌‌‌ తీసుకోవాలి. ముఖ్యంగా హార్ట్‌‌ రేట్‌‌, బాడీలో ఆక్సిజన్‌‌ లెవల్‌‌ని ఎప్పటికప్పుడు చెక్‌‌ చేస్తుండాలి. అందుకోసం ప్రతిసారి డాక్టర్‌‌‌‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వస్తున్న చాలా స్మార్ట్‌‌ వాచీల్లో ఈ ఫీచర్స్ ఉంటున్నాయి. ప్రత్యేకంగా కొన్ని ఫిట్‌‌నెస్‌‌ బ్యాండ్స్‌‌ కూడా మార్కెట్‌‌లోకి వచ్చాయి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ల చేతికి పెట్టి, యాప్‌‌ ద్వారా మొబైల్‌‌తో సింక్ చేయాలి. ఎప్పటికప్పుడు హార్ట్‌‌రేట్‌‌, ఆక్సిజన్‌‌ లెవల్స్‌‌ని మొబైల్‌‌లో చూడొచ్చు. ఇవి వాడడం వల్ల స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్‌‌‌‌ లాంటి వాటిని ముందుగానే గుర్తించొచ్చు. ఈ గాడ్జెట్స్‌‌లో స్లీప్, యాక్టివిటీ ట్రాకర్లు కూడా ఉంటాయి.
ధర: క్వాలిటీ, ఫీచర్స్‌‌ బట్టి 2,500 రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి.