ఆర్మీ రిక్రూట్‌‌మెంట్ రద్దయిందనే..

ఆర్మీ రిక్రూట్‌‌మెంట్ రద్దయిందనే..
  • అగ్నిపథ్​ స్కీంపై అభ్యర్థుల ఆందోళన
  • 2021 మార్చి ర్యాలీలో ఈవెంట్స్, టెస్టులు​ పూర్తి
  • రెండు రోజుల కిందట రాత పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటన

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌లో ఆర్మీ అభ్యర్థుల హింసాత్మక ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏడాది కిందటే నిర్వహించాల్సిన ఆర్మీ రిక్రూట్‌‌మెంట్‌‌ రాత పరీక్షను మూడుసార్లు వాయిదా వేసి, చివరకు రద్దు చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రిక్రూట్‌‌మెంట్ రద్దుకు అగ్నిపథ్ స్కీమే కారణమని భావించిన అభ్యర్థులు.. ముందుగానే ప్లాన్ చేసుకుని సికింద్రాబాద్‌‌లో ఆందోళనలకు దిగినట్లు సమాచారం. 2021 మార్చిలో హకీంపేటలో ఆర్మీ రిక్రూట్‌‌మెంట్ ర్యాలీ జరిగింది. దీనికి వివిధ జిల్లాల నుంచి దాదాపు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫిజికల్ ఈవెంట్స్‌‌ను మార్చి 4 నుంచి వారం పాటు నిర్వహించారు. తర్వాత మెడికల్ టెస్టులు​కూడా పూర్తయ్యాయి. అదే నెలలో రాత పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా వేశారు. ఏప్రిల్​లో పెడుతామని చెప్పి తర్వాత ఎలాంటి ప్రకటన చేయలేదు. మే నెలలో నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూట్‌‌మెంట్ ఆఫీసర్లు మరోసారి ప్రకటించారు. అయితే ఆ ఎగ్జామ్‌‌ను వాయిదా వేశారు.

వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుని..

ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన రాత పరీక్ష పెట్టనున్నట్లు ఆర్మీ వెబ్‌‌సైట్‌‌లో ప్రకటించింది. పరీక్ష తేదీకి రెండ్రోజుల ముందు మళ్లీ వాయిదా వేశారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా అగ్నిపథ్‌‌ను కేంద్రం ప్రకటించడం, అందులో నాలుగేండ్ల సర్వీస్ మాత్రమే ఉండటంతో ఆర్మీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. తమకు రాత పరీక్ష పెట్టకుండా.. కొత్తగా అగ్నిపథ్ తీసుకురావడం, అదీ కూడా టెంపరరీ బేసిస్‌‌లో కావడం, సాధారణంగా వచ్చే బెనిఫిట్స్ ఏమీ ఉండకపోవడంతో ఈవెంట్లు పూర్తి చేసుకున్న అభ్యర్థులంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. జిల్లాల వారీగా వాళ్లు అప్పటికే క్రియేట్ చేసుకున్న గ్రూప్‌‌లతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరొక గ్రూప్‌‌లోనూ ఏం చేద్దామనే దానిపై చర్చించారు. ఆర్మీ రిక్రూట్‌‌మెంట్ ఆఫీస్ దగ్గరకు గురువారమే వెళ్లాలని అనుకున్నారు. అయితే అన్ని జిల్లాల నుంచి అభ్యర్థులు రావాలని అనుకోవడం, గురువారం మధ్యాహ్నామే వారికి సంబంధించిన రాత పరీక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో మరింత కోపోద్రిక్తులయ్యారు. అప్పటికే ఇతర రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో ఆందోళనలు జరుగుతుండటం, ఫిజికల్, మెడికల్ టెస్టులు అన్నీ పూర్తయ్యాక ఏడాదికి పైగా వెయిట్ చేయించి.. ఇప్పుడు రాత పరీక్షను రద్దు చేయడంతో ఆందోళనకు దిగారు.