నిమజ్జనానికి కృత్రిమ చెరువులను ఏర్పాటు చేసుకోండి

నిమజ్జనానికి కృత్రిమ చెరువులను ఏర్పాటు చేసుకోండి

గణేష్ నవరాత్రులు, దుర్గాపూజ సందర్భంగా యమునా నది, ఇతర నీటి సరస్సుల్లో విగ్రహాలు నిమజ్జనం కాకుండా చూడాలని ఢిల్లీ ప్రభుత్వ కాలుష్య నియంత్రణ సంస్థ జిల్లా మేజిస్ట్రేట్‌లను కోరింది. విగ్రహాల నిమజ్జనం కోసం నివాస ప్రాంతాలకు సమీపంలో కృత్రిమ చెరువులను ఏర్పాటు చేసుకోవాలని స్థానిక సంస్థలను కోరింది. నగరంలోకి ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీఓపీ) విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాల ప్రవేశాన్ని తనిఖీ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనల ఉల్లంఘనలకు  పాల్పడితే రూ. 50,000 జరిమానా లేదా ఆరేండ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

విగ్రహాల నిమజ్జనం వల్ల వాటి తయారీలో ఉపయోగించే విష రసాయనాలు నీటిలో కలిసిపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని డీపీసీసీ తెలిపింది. POP విగ్రహాలపై పూసే పెయింట్స్, రంగులు, పాదరసం, జింక్ ఆక్సైడ్, క్రోమియం, లెడ్, కాడ్మియం వంటి ప్రమాదకరమైన రసాయనాలను కలిగి ఉంటాయన్నారు. ఇవి నీటిలోని జీవులకు హాని కలిగిస్తాయని పేర్కొంది. వీటిని మనుషులు వినియోగించినప్పుడు క్యాన్సర్, శ్వాసకోశ, చర్మ వ్యాధులతో సహా ఇతర రోగాల భారిన పడే ప్రమాదం ఉందన్నారు. యమునా నదిలో విగ్రహాల నిమజ్జనాన్ని 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించింది. ఢిల్లీ ప్రభుత్వం 2019లో తొలిసారిగా ఆదేశాలు జారీ చేసింది.