శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.3 కోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.3 కోట్ల గంజాయి పట్టివేత
  •     వాటర్ బాటిల్స్, చిప్స్ టిన్స్​, ఫుడ్ బాక్సుల్లో దాచి స్మగ్లింగ్​
  •     8.7 కిలోలు స్వాధీనం 

హైదరాబాద్​సిటీ, వెలుగు: శంషాబాద్​ఎయిర్​పోర్ట్​లో బ్యాంకాక్​నుంచి తీసుకువస్తున్న 8.7 కిలోల హైడ్రోపోనిక్​గంజాయిని కస్టమ్స్​అధికారులు పట్టుకున్నారు. వివరాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం వెల్లడించారు. థాయిలాండ్​లోని బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ఇండియన్​ప్యాసింజర్లు గాంజా తీసుకువస్తున్నారని పక్కా సమాచారం రావడంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 8.705 కిలోల హైడ్రోపోనిక్​గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 3.05 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఎక్కడ దాచారంటే..

నిందితులు గంజాయిని 24 నల్లటి ప్యాకెట్లలో ప్యాక్ చేసి.. ఇన్సులేటెడ్ వాటర్ బాటిళ్లు(థర్మాస్ బాటిల్స్), ఆలూ చిప్స్ టిన్స్, ఫుడ్ బాక్సుల్లో దాచి లగేజీ బ్యాగుల్లో దాచారు. తనిఖీలు చేస్తున్నప్పుడు కూడా తమ దగ్గర ఏమీ లేదని బుకాయించారు. నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్ తో చెక్​చేయగా గంజాయి అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఇద్దరు నిందితులను అరెస్ట్​చేశారు. స్మగ్లింగ్ వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ ఉందని, విచారణ జరుపుతున్నామని డీఆర్ఐ అధికారులు తెలిపారు.