ప్రేయర్​కు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్..నలుగురు మృతి

ప్రేయర్​కు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్..నలుగురు మృతి
  • ఆదిలాబాద్  జిల్లా గుడిహత్నూర్  మండలంలో ప్రమాదం
  • ఆటోను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
  • మృతులందరిదీ ఒకే కుటుంబం.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు

గుడిహత్నూర్, వెలుగు : మరో పావుగంటలో వారందరూ ఇంటికి చేరుకునేవారు. అంతలోనే మృత్యువాత పడ్డారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టడంతో నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్  జిల్లా గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌  మండలం మేకలగండి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు  ఈ  ప్రమాదం జరిగింది. మృతులను ఏముల పొచ్చన్న (58), ఏముల గంగమ్మ (48), శైలజ (28), మడావి సోంబాయి (63) గా గుర్తించారు. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. వారిలో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడకు చెందిన పొచ్చన్న గత కొన్నేళ్లుగా ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ పట్టణం రవీంద్ర నగర్‌‌‌‌‌‌‌‌లో నివాసం ఉంటున్నాడు.

ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతున్నాడు. పొచ్చన్నకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. వారందరూ ప్రతి నెలా రెండో శుక్రవారం ప్రేయర్‌‌‌‌‌‌‌‌  కోసం ఇచ్చోడలోని హోలీ మౌంటెయిన్  చర్చికి వెళ్తుంటారు. ఈ శుక్రవారం కూడా పొచ్చన్న తన కుటుంబంతోపాటు పట్టణంలోని బాలాజీ గార్డెన్  సమీపంలో నివాసం ఉంటున్న మడావి సోంబాయి (సలోమి) కుటుంబ సభ్యులతో కలిసి తన ఆటోలో సాయంత్రం బయల్దేరి వెళ్లాడు. ఈ ఆటోలో పొచ్చన్న, ఆయన భార్య గంగమ్మ, కూతురు శైలజ, ఇద్దరు మనువరాళ్లు, ఒక మనువడు ఉన్నారు. అలాగే సోంబాయి, ఆమె పెద్ద కుమారుడు ప్రేమ్‌‌‌‌‌‌‌‌ సాగర్, మనువడు దీపక్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌లతో కలిపి మొత్తం తొమ్మిది మంది బయల్దేరి వెళ్లారు.

ఇచ్చోడలోని చర్చిలో రాత్రి 9:30 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రార్థనలు జరిగాయి. అప్పటివరకు సంతోషంగా  ప్రార్థనలు చేసిన రెండు కుటుంబాలు ఇంటికి తిరుగుముఖం పట్టాయి. మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా మేకలగండి వద్ద వెనుక నుంచి ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ ఎగిరిపడ్డారు. ఆటో నుజ్జునుజ్జయ్యింది. తెల్లవారుజామున ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌  మార్కెట్‌‌‌‌‌‌‌‌కు కూరగాయలు తీసుకువెళ్లే కొందరు ఈ సంఘటనను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని వెంటనే రిమ్స్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 

ఉద్యోగం వచ్చిందని ప్రార్థనకు వెళ్లి మృత్యువాత

ప్రమాదంలో మృతిచెందిన శైలజకు కొన్నేళ్ల క్రితం జన్నారానికి చెందిన దాసరి కిరణ్‌‌‌‌‌‌‌‌తో పెండ్లయింది. ఆమె గర్భిణీగా ఉన్నపుడు డెలివరీ కోసం ఇటీవలే ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌  పట్టణంలో పుట్టింటికి వచ్చింది. ఎనిమిది నెలల క్రితం ప్రసవం జరిగింది. ప్రస్తుతం తల్లిగారి ఇంట్లోనే ఇద్దరు కూతుర్లతో ఉంటున్నది. ఇటీవలే ఆమెకు ఉట్నూర్‌‌‌‌‌‌‌‌  మండలంలోని దండేపల్లి పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో స్టాఫ్‌‌‌‌‌‌‌‌ నర్సుగా జాబ్‌‌‌‌‌‌‌‌  రావడంతో అమ్మ, నాన్న, కూతుర్లతో కలిసి ఇచ్చోడ చర్చికి ప్రేయర్‌‌‌‌‌‌‌‌  కోసం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో తండ్రి పొచ్చన్న, తల్లి గంగమ్మతో మృత్యువు ఒడిలోకి చేరింది. కాగా, పొచ్చన్న మనుమడు తేజవర్ధన్ కు కాలుతో పాటు ఊపిరితిత్తులు, ఛాతీ భాగంలో ఎముకలు విరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇక సోంబాయి వెంట ఉన్న ఆమె పెద్ద కుమారుడు ప్రేమ్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌తో పాటు మనుమడు దీపక్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌  కూడా గాయపడ్డారు. ప్రస్తుతం రిమ్స్‌‌‌‌‌‌‌‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బోథ్‌‌‌‌‌‌‌‌  సీఐ కిరణ్‌‌‌‌‌‌‌‌ కుమార్, గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌ ఎస్సై ప్రవీణ్‌‌‌‌‌‌‌‌  కుమార్‌‌‌‌‌‌‌‌  తెలిపారు. ఆటోను ఢీకొన్న వెహికల్  కోసం గాలిస్తున్నామని చెప్పారు.