IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (78) విధ్వంసకర బ్యాటింగ్, ధ్రువ్ జురెల్(81 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి రాజస్థాన్ బౌలింగ్ తీసుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ పట్టుదలగా ఆడి లక్ష్యాన్ని ఛేదించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0) గోల్డెన్ డక్ కావడంతో జట్టు ఆదిలోనే కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. విరాట్ కోహ్లీ (36), రొమారియో షెపర్డ్ (22) రాణించగా, చివర్లో వెంకటేష్ అయ్యర్ (29) మెరుపు బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ 200 మార్కును దాటగలిగింది. మిగిలిన బ్యాటర్లు దేవదత్ పడిక్కల్ (14), టీమ్ డేవిడ్ (13), జితేష్ శర్మ (5), కృనాల్ పాండ్యా (1) విఫలమయ్యారు.
ఇక 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (13) త్వరగానే పెవిలియన్ చేరాడు. కానీ, ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసిన వైభవ్ ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తన ఇన్సింగ్స్ లో మొత్తంగా 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసిన వైభవ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన వెంటనే షిమ్రాన్ హెట్‌మయర్ (0)ను కూడా కృనాల్ అవుట్ చేశాడు. ఆ వెంటనే కెప్టెన్ రియాన్ పరాగ్ (3) కూడా పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ 134 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో ధ్రువ్ జురెల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. రవీంద్ర జడేజా (24 నాటౌట్) జురెల్‌కు చక్కని సహకారం అందించడంతో రాజస్థాన్ ఈ సీజన్‌లో తన విజయ పరంపరను కొనసాగించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Back-to-back breakthroughs when #RCB needed it the most 👊
— IndianPremierLeague (@IPL) April 10, 2026
🎥 Krunal Pandya doing the damage 👏
Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @RCBTweets pic.twitter.com/KSXAgY6dgv
