మాదాపూర్లో ఐటీ ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్ల మోసం.. 452 మంది నిరుద్యోగులు నిండా మునిగారు

మాదాపూర్లో ఐటీ ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్ల మోసం.. 452 మంది నిరుద్యోగులు నిండా మునిగారు

ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటీ ఇండస్ట్రీలో భారీ మార్పులు వస్తున్నప్పటికీ.. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ.. లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము ట్రైన్ చేసుకుని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలని ఎందరో కలలు కంటున్నారు. అలాంటి వాళ్ల ఆశలను, లక్ష్యాలను క్యాష్ చేసుకుంటూ కోట్లలో దండుకుని నిండాముంచుతున్నారు కొందరు దుండగులు. అలాంటిదే హైదరాబాద్ మాదాపూర్ లో 5 కోట్ల రూపాయల మోసం బయటపడింది. 

వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు మాదాపూర్ పోలీసులు. 2026 ఏప్రిల్ 10న ఐటీ ఉద్యోగాల పేరుతో స్కామ్ కు పాల్పడిన కేటుగాళ్లను పట్టుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మొత్తం 10 మంది ఒక ముఠా గా ఏర్పడి నియామకాలకు పాల్పడ్డారు. 

Camel Q సాఫ్ట్ వేర్ సొల్యూషన్ సంస్థ పేరుతో నిరుద్యోగుల నుంచి  5 కోట్ల రూపాయలు వరకు వసూలు చేసింది ఈ ముఠా. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  452 మంది అభ్యర్థుల నుండి ఒక్కొక్కరి వద్ద రూ 80 వేల నుండి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. శిక్షణ, ప్లేస్మెంట్స్ పేరుతో నమ్మించి ప్రారంభంలో కొందరికి జీతాలు చెల్లించి ఆ తర్వాత బోర్డు తిప్పేశారు.  

►ALSO READ | 3-6 నెలల్లో ఎల్బీనగర్లో దోమలు మాయం.. జర్మన్ టెక్నాలజీతో నడిచే ఫాగింగ్ యంత్రాలు ప్రారంభం

అక్రమ సంపాదనకు మరిగిన ముఠా.. ఇటీవల MU సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరుతో మరో కొత్త సంస్థను ప్రారంభించారు. పక్కా నిఘాతో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఎరుకల మహేష్(32) తో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.

నిందితుల నుంచి ఒక కారు, స్కూటీ, మొబైల్ ఫోన్లు, కంపెనీ స్టాంపులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాపై గతంలో మాదాపూర్, KPHB పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు తెలిపారు.  బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.