- డొమెస్టిక్ సింగిల్ సిలిండర్ టు డబుల్ కూ నో చాన్స్
- కమర్షియల్ గ్యాస్ కొత్త కనెక్షన్ల పైనా బ్యాన్
- సింగిల్ సిలిండర్ వినియోగదారులకు గ్యాస్ తిప్పలు
- రాష్ట్రంలోని 1.32 గ్యాస్ కనెక్షన్లలో 71.68 లక్షలు సింగిల్ వే
- కట్టెల పొయ్యి, కరెంట్ స్టవ్‌ల వైపు మొగ్గు
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా గృహ వినియోగ, వ్యాపార వినియోగ గ్యాస్ కనెక్షన్ల మంజూరు తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే సింగిల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను డబుల్ సిలిండర్ కనెక్షన్లుగా మార్చుకునేందుకు కూడా ప్రస్తుతం అవకాశమివ్వడం లేదు. ఇరాన్–అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటం, ముందస్తు బుకింగ్‌లు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో సింగిల్ సిలిండర్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలిండర్ అయిపోతే రెండు మూడు రోజులు, కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో చాలామంది కట్టెల పొయ్యి లేదా విద్యుత్ ఆధారిత వంట పరికరాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు వ్యాపార వినియోగ గ్యాస్ కొత్త కనెక్షన్లపైనా నిషేధం విధించారు.
సగానికి పైగా సింగిల్ సిలిండర్ కనెక్షన్లే..
రాష్ట్రంలో సుమారు 1.32 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వాటిలో 71.68 లక్షలు సింగిల్ సిలిండర్ కనెక్షన్లు. మరో 60 లక్షల కనెక్షన్లు డబుల్ సిలిండర్లు. అంటే సగానికి పైగా కుటుంబాలు సింగిల్ కనెక్షన్లపైనే ఆధారపడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో మొత్తం 3,43,298 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వాటిలో 1,70,267 సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, 1,69,834 డబుల్ కనెక్షన్లు ఉన్నాయి. యుద్ధ పరిస్థితులకు ముందు వరకు సింగిల్ సిలిండర్ వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు.
గ్యాస్ అయిపోగానే బుక్ చేస్తే అదే రోజు లేదా మరుసటి రోజు సరఫరా జరిగేది. అయితే ప్రస్తుతం సాధారణ రోజుల కంటే బుకింగ్‌లు దాదాపు రెట్టింపు కావడంతో సరఫరాలో ఆలస్యం ఏర్పడుతోంది. డబుల్ సిలిండర్ ఉన్నవారికి పెద్దగా సమస్య లేకపోయినా, సింగిల్ సిలిండర్ వినియోగదారులు మూడ్నాలుగు రోజులు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో చాలామంది అదనపు సిలిండర్ కోసం దరఖాస్తు చేస్తున్నా, ప్రస్తుతం కొత్త కనెక్షన్లపై నిషేధం ఉందని ఏజెన్సీలు చెబుతున్నాయి.
ఒకట్రెండు రోజుల్లో అందేలా చర్యలు
రాష్ట్రంలో గృహ, వ్యాపార వినియోగ గ్యాస్ కొత్త కనెక్షన్లపై తాత్కాలిక నిషేధం అమల్లో ఉంది. సింగిల్ సిలిండర్ వినియోగదారుల నుంచి డబుల్ సిలిండర్ కనెక్షన్లకు డిమాండ్ పెరిగినప్పటికీ ప్రస్తుతం అదనపు సిలిండర్ మంజూరు చేయడం లేదు. అయితే సింగిల్ సిలిండర్ వినియోగదారులకు ఒకటి రెండు రోజుల్లో సిలిండర్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
- నర్సింగారావు, డీఎస్వో, కరీంనగర్
కనెక్షన్ ఉంటేనే కమర్షియల్ సిలిండర్..
ఇటీవలి వరకు వ్యాపార వినియోగ గ్యాస్ సిలిండర్లు ఏజెన్సీల వద్ద సమృద్ధిగా అందుబాటులో ఉండేవి. ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే వెంటనే సరఫరా అయ్యేది. దీంతో చాలా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు ప్రత్యేకంగా కమర్షియల్ కనెక్షన్ తీసుకోకుండానే సిలిండర్లు వినియోగించేవి. కానీ ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా సరఫరాపై నియంత్రణ విధించారు.
గతంలో కనెక్షన్ ఉన్నవారికే బుకింగ్ ఆధారంగా సిలిండర్లు ఇస్తున్నారు. వారికి కూడా గత ఆరు నెలల వినియోగాన్ని ఆధారంగా తీసుకుని పరిమితంగా సరఫరా చేస్తున్నారు. దీంతో అనేక మంది వ్యాపారులు కొత్త కనెక్షన్ల కోసం ఏజెన్సీలను సంప్రదిస్తున్నా, నిషేధం ఉన్నందున నిరాశ చెందుతున్నారు. కరీంనగర్ నగరం సహా జిల్లావ్యాప్తంగా కేవలం 2,915 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఉండటం గమనార్హం.
