6.9 అంగుళాల డిస్ ప్లేతో యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్..!

6.9 అంగుళాల డిస్ ప్లేతో యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్..!

యాపిల్ మొబైల్ ఫోన్లకు సంబంధించి ఓ క్రేజీ వార్త హల్ చల్ చేస్తోంది. రాబోయే కాలంలో కంపెనీ యాపిల్ ఫోన్ల డిస్ ప్లే పరిమాణాలను పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో యాపిల్ యూజర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్నుంచే ఆ తరహా మొబైల్లను కొనడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

రాబోయే కాలంలో ఇంట్రడ్యూస్ చేసే యాపిల్ ఐఫోన్ 16(Apple iPhone 16) సిరీస్ మొబైళ్ల డిస్‌ప్లే ప్యానెళ్ల సైజులో మార్పులు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 15 సిరీస్‌ను ఇంకా ప్రారంభించనప్పటికీ , వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే ఐఫోన్ సిరీస్ కోసం కొన్ని కీలక ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 16 ప్రో మోడల్స్ డిస్‌ప్లేలో పెద్ద మార్పులు చూస్తారని, ఇది వినియోగదారులకు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుందని ఓ వార్త కూడా వైరల్ అవుతోంది.

ప్రస్తుత iPhone 14 Pro, రాబోయే iPhone 15 Pro మోడల్‌తో పోలిస్తే iPhone 16 Pro, iPhone 16 Pro Max పెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని Apple విశ్లేషకుడు రాస్ యంగ్ పేర్కొన్నారు. ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల స్క్రీన్ ను కలిగి ఉండవచ్చని, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉండవచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ఐఫోన్‌లు గరిష్టంగా 6.7 అంగుళాల డిస్‌ప్లే పరిమాణాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి పెద్ద డిస్‌ప్లే గల iPhone 16 మోడల్‌లు మరింత ఉత్తేజపరిచేలా చేస్తాయని ఆయన అంటున్నారు. అయితే, ఇవి ఖచ్చితమైన పరిమాణాలు కావని కూడా వెల్లడవుతోంది.

ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు 6.1, 6.7-అంగుళాల డిస్ ప్లే సైజును కలిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఐఫోన్ 16 ప్రో మోడల్స్ డిస్‌ప్లేలపై ప్రస్తుతం వచ్చేవన్నీ పుకార్లు మాత్రమేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాస్ యంగ్‌ ఈ విషయంపై అంచనా వేసిననప్పటికీ, 2024లో రిలీజ్ కానున్న 16 సిరీస్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేనందున మరికొందరు ఈ వార్తల్ని కొట్టిపారేస్తున్నారు.