1000  రోజులు.. అబద్ధాలు, మోసాలు..కాంగ్రెస్ పాలనపై బీజేపీ చార్జిషీట్

1000  రోజులు.. అబద్ధాలు, మోసాలు..కాంగ్రెస్ పాలనపై బీజేపీ చార్జిషీట్
  • కాంగ్రెస్ పాలనపై బీజేపీ చార్జిషీట్
  • రాష్ట్రంలో 7.15% నేరాలు పెరిగాయి
  • లా అండ్ ఆర్డర్​ను గాలికొదిలేశారు
  • అభివృద్ధి శూన్యం, స్కామ్స్, అవినీతి 
  • మీడియాతో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అంతా అబద్ధాలు, మోసాలతోనే సాగుతోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందని, అభివృద్ధి శూన్యమని, కేవలం కుంభకోణాలు, అవినీతి పాలన కొనసాగుతోందని విమర్శించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ‘1000 రోజులు–1000 అబద్ధాలు - 1000 మోసాలు’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఆయన చార్జ్‌‌షీట్ రిలీజ్ చేశారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని, దీని ద్వారా ఒక్కో మహిళ దాదాపు రూ.83,300 వరకు కోల్పోయారని ఆయన వివరించారు.రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందక 80 శాతం కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్న హామీని మూడు సీజన్లుగా ఎగ్గొట్టారని, రూ.2 లక్షల రుణమాఫీ పేరుతో సుమారు 22 లక్షల మంది రైతులను నిలువునా దగా చేశారని విమర్శించారు.

కౌలు రైతులకు ఇస్తామన్న సాయం మూడేళ్లుగా బకాయి పడిందని, వృద్ధులు, వికలాంగుల పెన్షన్ల పెంపు హామీ కూడా నేటికీ అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా అతలాకుతలమైందని, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ కింద రూ.15వేల కోట్ల బకాయిలు పెట్టి 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో కనీస వసతులు కరువయ్యాయని, బాసర ట్రిపుల్ ఐటీని ప్రొఫెసర్లు, నిధుల్లేకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు యువ వికాసం భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాల హామీల ఊసే లేదన్నారు. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, వేలాది కోట్ల రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. 

5, 6 తేదీల్లో బీజేపీ దీక్ష

హైదరాబాద్ అభివృద్ధిని గాలికి వదిలేసి, మూసీ పునరుద్ధరణ పేరుతో రూ. లక్షన్నర కోట్లతో కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హైడ్రా, 22ఏ, ధరణి సమస్య లతో రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నేరాల రేటు 7.15 శాతం పెరిగిందని, హోంమంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు మంటగలిశాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని పేర్కొన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ స్టేట్ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన ఏలేటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండకు వెళ్తారనే అనుమానంతో ముందస్తుగా అదుపులోకి తీసుకొని మలక్‌‌పేట పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.