ఎగ్జామినేషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఎగ్జామినేషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం
  •     అనుమానితులను వారెంట్​లేకుండానే అరెస్టు చేయొచ్చు
  •     నాన్​ బెయిలబుల్,రాజీ చేసుకునే చాన్స్​ ఉండదు

న్యూఢిల్లీ: ప్రభుత్వ నియామక పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీలు, కాపీయింగ్ వంటి మోసపూరిత పద్ధతులను అరికట్టేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్​ ఆఫ్​ అన్​ ఫెయిర్ మీన్స్) బిల్లును లోక్‌‌సభ మంగళవారం ఆమోదించింది.

ఈ బిల్లు ప్రకారం పేపర్లు లీక్ చేసినా, ఆన్సర్​ షీట్లు ట్యాంపర్ చేసినా పదేండ్ల జైలు, రూ.1 కోటి ఫైన్​ విధించేలా ప్రతిపాదించారు. అలాగే ఇందులో పేర్కొన్న నేరాలు నాన్- బెయిలబుల్, నాన్ -కాంపౌండ్ చేయదగినవి, రాజీ ద్వారా పరిష్కరించుకునే చాన్స్ లేదు. వారెంట్ లేకుండానే అనుమానితులను అరెస్టు చేసే అధికారం పోలీసులకు కల్పించారు.

ధరల కట్టడికి చర్యలు: సీతారామన్ 

ధరల పెరుగుదలను అదుపుచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నాసిరకం వస్తువుల కట్టడికి తీసుకున్న చర్యల వల్ల ద్రవ్యోల్బణం(ఇన్​ఫ్లేషన్​) అదుపుచేయగల స్థాయికి తగ్గిందని చెప్పారు. మంగళవారం రాజ్యసభలో ఆమె ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ దేశంలో రిటైల్ ఇన్​ఫ్లేషన్ 2022లో 6.8 శాతం ఉండేదని.. 2023లో దాన్ని 5.5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. త్వరగా పాడైపోయేవి, ఇండియాలో పండని పంటల కొరత వల్ల ఏర్పడే ఇబ్బందులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ‘భారత్ ​దాల్’ పేరుతో కేజీ శనగపప్పును రూ.60కే అమ్ముతున్నట్లు చెప్పారు. అలాగే తక్కువ ధరలో ‘భారత్ ​బియ్యం’  కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. 

పీఎం- కిసాన్ పెంచే ఆలోచన లేదు: కేంద్రం

పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందిస్తున్న ఆర్థిక సాయం రూ.6 వేలను.. రూ.8 వేల నుంచి- రూ.12వేలకు పెంచే ప్రతిపాదన లేదని పరిశీలనలో ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది.  మంగళవారం  కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్​ ముండా ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. కాగా, 60 ఏండ్ల తర్వాత రైతుకు రూ.3 వేలు పెన్షన్​ అందించే ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్​ధన్ యోజన(పీఎంకేఎంవై) కింద దేశవ్యాప్తంగా మొత్తం 23,38,720 మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు అర్జున్ ముండా లోక్​సభకు వెల్లడించారు. వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సంజయ్‌‌ అగర్వాల్‌‌ నేతృత్వంలోని కనీస మద్దతు ధర(ఎంఎస్‌‌పీ) కమిటీ ఇప్పటి వరకు 37 మీటింగ్​లు నిర్వహించిందని తెలిపారు.

2018-22 మధ్య 701 దేశద్రోహం కేసులు

2018 నుంచి 2022 వరకు 701 దేశద్రోహం కేసులు, 5,023 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కేసులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌‌సభకు వెల్లడించారు.