సిద్ధిపేటజిల్లా గజ్వేల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో జరిగింది ఈ ఘటన. మంగళవారం ( మార్చి 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జ్యోతి ఒంటరి మహిళ. కూలి పనికి వెళ్లి జీవనం సాగిస్తున్న జ్యోతి ఇవాళ కూడా కూలి పనికి వెళ్ళింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి.. ఇంట్లో మంటలు వ్యాపించాయి.
ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ అయ్యుండచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ. పది లక్షల మేర ఆస్తి నష్టం సంభవించి ఉండచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
