జపాన్ వెళ్లిన మన స్టూడెంట్స్..‘సాకురా’ ప్రోగ్రామ్కు తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక

జపాన్ వెళ్లిన మన స్టూడెంట్స్..‘సాకురా’ ప్రోగ్రామ్కు తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక
  • రేపటి నుంచి జరిగే అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు హాజరుకానున్న విద్యార్థులు
  • అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న నలుగురు విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు వెళ్లారు. జపాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జపాన్ సైన్స్ హైస్కూల్ ప్రోగ్రామ్ (సాకురా సైన్స్ ఎక్స్ఛేంజ్​ ప్రోగ్రామ్)కు తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.

ఈ నెల 24 నుంచి 30 వరకు అక్కడ జరగనున్న అంతర్జాతీయ సైన్స్ సదస్సులో పాల్గొననున్నారు. జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ, భారత విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మన విద్యార్థులు శుక్రవారం జపాన్ బయలుదేరి వెళ్లారు. అక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖికి హాజరై, అత్యాధునిక పరిశోధనా సంస్థల సందర్శనతోపాటు జపాన్ విద్యా విధానాన్ని పరిశీలించనున్నారు. 

ఎంపికైన విద్యార్థులు వీరే..

ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో నామినేషన్లను స్వీకరించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్క్రీనింగ్ టెస్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురిని తుది జాబితాకు ఎంపిక చేశారు. వీరిలో కరీంనగర్ జిల్లాలోని ఎల్గందల్ మోడల్ స్కూల్​ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని జి.శివాంజలి, హనుమకొండ జిల్లా హసన్ పర్తి తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజీ ఫస్టియర్ విద్యార్థిని అక్షయ, మహబూబ్ నగర్​ట్రిపుల్ఐటీలో ఫస్టియర్ స్టూడెంట్​పరుష, సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ మోడల్ స్కూల్ ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్​వేణు ఉన్నారు.

ఈ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తిని చాటాలని సూచించారు. ఈ పర్యటన విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచుతుందని, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్​చార్జి కమిషనర్ శ్రీదేవసేన, ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.