- నివారణ సింపుల్.. మన చేతుల్లోనే ఉంది.. ఏమేం చేయాలంటే..
- యువతనూ విడిచిపెట్టని గుండె జబ్బులు.. నాలుగైదేళ్లుగా కేసులు పెరగుతున్నాయి..
- 50 ఏళ్లు పైబడితేనే గుండె జబ్బులనేది పాత మాట
గుండె జబ్బులు ఎలా వస్తాయి.. ఎవరరెవరికి వస్తాయి.. రాకుండా ముందే గుర్తించడమెలా.. గుండె జబ్బుల సూచనలు కనిపిస్తే ముందే అడ్డుకోవచ్చా.. అస్సలు రాకుండా నివారించొచ్చా.. అన్న సమస్యలకు అవును అంటున్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు. 50 ఏళ్లు పైబడిన వారికి.. ముఖ్యంగా బీపీ, షుగర్ తదితర సమస్యలున్న వారికి మాత్రమే గుండె జబ్బులొస్తాయనేది పాత మాట. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా నమోదువుతున్న గుండె జబ్బుల కేసులు, సోకుతున్న వారి వయసు సంఖ్య చూస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలిసొస్తాయి. వయసు మళ్లిన వారు.. ఊబకాయంతో ఉన్న వారు.. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువున్న వారికే గుండె జబ్బులనేది చాలా వరకు నిజమే అయినా.. యుక్త వయసు వారికి కూడా గుండె జబ్బులొస్తున్నాయి. ముఖ్యంగా టీనేజ్ దాటిన వారిలో కూడా గుండె జబ్బులు, విద్యార్థులను సైతం గుండె జబ్బుల సూచనలు కనిపిస్తుండడం వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వయసు మళ్లినవారి కంటే యువతలో ఈ మధ్య కాలంలో గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లైఫ్ స్టైల్ లో మార్పులే గుండె జబ్బులకు కారణం
మారుతున్న లైఫ్ స్టైల్ రోజు రోజుకూ గుండె జబ్బుల సమస్యలు పెంచుతోంది. వయసుమళ్లిన వారికే కాదు.. యువతలో కూడా గుండె జబ్బుల సమస్యలు పెరుగుతున్నాయి. కారణమేమిటంటే.. దైనందిన కార్యక్రమాలు (రోజువారి దినచర్య.. లైఫ్ స్టైల్) అలవాట్లు కొంప ముంచుతున్నట్లు వైద్య నిపుణుల అధ్యయనాల్లో వెల్లడైంది. ఉద్యోగులు, లేదా వ్యాపారుల్లో పని ఒత్తిడి వల్ల సహజం అనుకుంటే.. యువతలో కూడా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని అధ్యయనాలు చేస్తున్నారు. పరీక్షల ఒత్తిడి, కెరీర్... ఉద్యోగ సమస్యలు.. లైఫ్ లో సెటిల్ కావాలన్న బెంగ..ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఉద్యోగంపై అభద్రతా భావం వంటి ఒత్తిళ్లు యూత్ ను గుండె జబ్బుల పాలు చేస్తున్నట్లు గుర్తించారు. పైకి చెప్పుకోలేకపోయినా.. పరీక్షల బెంగ కూడా గుండెపోటుకు దారితీస్తున్నట్లు కొన్ని కేసుల్లో నిర్ధారణ అయింది. గుండె జబ్బులు ఎందుకొస్తున్నాయి.. కారణాలేమిటన్నది హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ ముఖర్జీ ‘‘ప్రపంచ గుండె జబ్బుల దినోత్సవం’’ సందర్బంగా వీ-6 న్యూస్, వెలుగు కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన చెప్పిన వివరాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి.
రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్.. జంక్ ఫుడ్. పోషక ఆహారం గురించి పట్టింపులు లేకుండా తింటున్నారు. ఆహారపు విలువలు, పోషక విలువలు తగ్గిపోతున్నాయి.
నిన్న మొన్నటి వరకు శారీరక శ్రమ ఉండేది. కానీ ఇప్పుడు శారీరక శ్రమ నెమ్మదిగా తగ్గిపోతోంది. శారీరక శ్రమ తగ్గేకొద్దీ గుండె జబ్బులకు చేరువవుతున్నట్లే లెక్క.
గత ఆరేళ్లుగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. 2016 తర్వాత 2021 వరకు గుండె జబ్బులు వాళ్లు, వీళ్లు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిలోనూ కనిపిస్తోంది. రెండేళ్లుగా గుండె జబ్బుల సమస్యలు రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయి.
- యువత నుంచి వయసు మళ్లిన వారి వరకు మానసిక ఒత్తిడి గుండె జబ్బులకు దారితీస్తోంది.
- తల్లిదండ్రులు పిల్లలకు ఏదడిగితే అది ఇస్తున్నారే తప్ప వారికి శారీరక శ్రమకు అలవాటు చేయడం లేదు.
- పొగ తాగడం, మద్యం తాగే అలవాట్లు మరింత ముప్పును పెంచుతున్నాయి.
- శారీరక శ్రమ లేకపోవడం, నడిచే అలవాటు తగ్గిపోవడం.. ప్రతి చిన్న దానికి వాహనాలపైనే ఆధారపడడం.
- కరోనా సమయంలో అదుపులో ఉన్నట్లు కనిపించినా.. ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో వస్తున్నాయి.
నివారణ అందరికీ తెలిసినవే..
గుండె జబ్బులు నివారణ ఎలా అన్నది చాలా మందికి తెలిసినవేనని, అయితే వాటిని పాటించడంలోనే అందరూ పెదవివిరుస్తూ... రేపు మాపు అంటూ వాయిదాలు వేసుకుంటూ కూర్చున్న కొమ్మను నరుక్కున్న విధంగా వ్యవహరిస్తున్నారని గుండె వైద్య నిపుణులు డాక్టర్ ముఖర్జీ విశ్లేషించారు. సినిమాలు, స్నేహితుల ప్రభావంతో దురలవాట్లను దూరం చేసుకోకపోతే.. జీవితకాలం చివరి రోజులకు దగ్గరవుతున్నట్లేనని చెప్పక తప్పదని ఆయన వివరించారు. ఆయన చెప్పిన నివారణ మార్గాలు ఇలా ఉన్నాయి...
రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు శారీరక శ్రమ, నడక తప్పనిసరి చేసుకోవాలి.
మద్యం, పొగ తాగడం ఫ్యాషన్ అనే భ్రమలో నుంచి బయటపడాలి. వీటిని దూరంగా పెట్టాలి.
జిమ్ చేస్తున్న వారు శరీరాకృతి కోసం స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఇది ప్రమాదకరం.
మంచి పౌష్టిక విలువలున్న పప్పుదినుసుల ఆహారం తీసుకోవాలి. ఆహారంలో నాణ్యత ముఖ్యం.
రెడీ మేడ్ ఫాస్ట్ ఫుడ్ కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
కొవ్వు, కేలరీస్ లేని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆహారంలో నూనె తగ్గించాలి.
రోజూ తినే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు ఒక భాగం కావాలి.
పని ఒత్తిడి అలవాట్లను దూరం చేసుకుని.. ఆడుతూ పాడుతూ పనిచేసే అలవాటు పెంపొందించుకోవాలి.
కరోనా వచ్చిపోయిన వారు వైద్యుల పర్యవేక్షణలో ఆహారం తీసుకోవాలి.
