హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి ప్రకటన

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి ప్రకటన
  • బల్మూర్ వెంకట్ పేరును ప్రకటించిన కాంగ్రెస్ 

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరి వెంకట్ పేరును ప్రకటించింది. రాష్ట్ర పార్టీ సిఫారసు మేరకు వెంకట్ పేరును ఖరారు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్, అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున గెల్లు శ్రీనివాస్ బరిలోకి దిగారు. మాజీ మంత్రి ఈటల రాజీనామా చేసిన నాటి నుంచే నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. టీఆర్ఎస్ తరపున మంత్రులు అక్కడే మకాం వేసి పర్యవేక్షణ చేస్తున్న నేపధ్యంలో అభ్యర్థి ఎంపిక కోసం తీవ్రంగా కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ సస్పెన్స్ కు తెరదించుతూ బల్మూరి వెంకట్ ను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది. 

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరరాజనరసింహ నేతృత్వంలోని కమిటీ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించి ఆశావహుల పేర్లు పరిశీలించింది. ఒక దశలో కొండా సురేఖను బరిలోకి దింపే ప్రతిపాదన పరిశీలించగా.. ఆమె పలు షరతులు విధించినట్లు ప్రచారం జరిగింది. అంచనాలు ఎలా ఉన్నా.. చివరకు కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకుడు, ఎన్ఎస్ యూ అధ్యక్షుడిగా అనేక పోరాట కార్యక్రమాల్లో పాల్గొన్న వెంకట్ ను ఎంపిక చేసింది. 

బల్మూరి వెంకట్ పూర్వపరాలు..
బల్మూరి వెంకట్ యువజన కాంగ్రెస్ (ఎన్ఎస్ యూఐ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మాజీ మంత్రి తక్కెలపెల్లి పురుషోత్తమరావుకు వరుసకు మనవడు అవుతాడు వెంకట్. మరోవైపు కెసిఆర్ కుటుంబంతో కూడా సంబంధాలున్నాయి. సీఎం కేసీఆర్ కూడా వరుసకు తాత అవుతాడు. రాజకీయంగా భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు సపోర్ట్ గా వున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వెంకట్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ కోసం సీరియస్ గా ట్రై చేశారు. కానీ పొత్తుల్లో భాగంగా అది దక్కలేదు. కొండా సురేఖ పై ఆశపెట్టుకున్న  పీసీసీకి సురేఖ హ్యాండ్ ఇవ్వడంతో.. అనూహ్యంగా వెంకట్ తెరపైకి వచ్చాడు. టికెట్ రేసులో పత్తి కృష్ణారెడ్డి, రవికుమార్, ప్యాట రమేష్ లాంటి నాయకులు పోటీకి వచ్చినా..అధికార పార్టీ ఎత్తుగడలకు వారిపై నమ్మకం లేక.. వెంకట్ వైపు నేతలు మొగ్గు చూపారు. కరోనా సమయంలో పిపిఈ కిట్లు వేసుకొని ప్రగతి భవన్ ముట్టడించారు. కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్యే సీతక్కతో కలసి 48 గంటల దీక్ష చేశాడు బల్మురి వెంకట్. మంత్రి మల్లారెడ్డి చెరువును కబ్జా చేసి హాస్పిటల్ కట్టించాడని అక్కడ ఆందోళనకు చేసిండు.