తెలంగాణలో పెరుగుతోన్న కిడ్నీ బాధితులు.. ప్రతి పది మందిలో ఒకరికి ప్రాబ్లమ్

తెలంగాణలో పెరుగుతోన్న కిడ్నీ బాధితులు.. ప్రతి పది మందిలో ఒకరికి ప్రాబ్లమ్
  • ప్రతి పది మందిలో ఒకరికి ప్రాబ్లమ్
  • రెండేండ్లలో డయాలసిస్‌‌ స్టేజ్‌‌కి 5,300 మంది
  • ప్రతి వంద మంది పేషెంట్లలో పది మంది పదేండ్లలోపు పిల్లలే
  • పిల్లలకు కిడ్నీ జబ్బులు ఎక్కువగా నమోదవుతున్న టాప్‌‌‌‌‌‌‌‌ 4 రాష్ట్రాల్లో తెలంగాణ
  • ప్రతి 6 నెలలకు ఒకసారి టెస్టులు చేయించుకోవాలంటున్న డాక్టర్లు
  • మన దగ్గర ఉన్న నెఫ్రాలజిస్టులు 200 లోపే
  • కిడ్నీ సమస్యను తొలిదశలో గుర్తించలేకపోతున్న ఇతర డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కిడ్నీ బాధితుల సంఖ్య ఏటికేడు పెరుగుతున్నది. ప్రతి ఊరిలో కనీసం ఇద్దరు డయాలసిస్ పేషెంట్లు ఉంటున్నారు. గడిచిన రెండేళ్లలో 5,300 మంది కొత్తగా డయాలసిస్‌‌ చేయించుకుంటున్న వారి జాబితాలో చేరారు. జీఎఫ్‌‌ఆర్‌‌‌‌(గ్లోమెరూలర్‌‌‌‌ ఫిల్ట్రేషన్‌‌ రేటు) ప్రకారం రాష్ట్రంలో ప్రతి పది మందిలో ఒకరు ఏదో ఒక స్థాయి కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నట్టు డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరగడానికి లైఫ్‌‌ స్టైల్‌‌లో వచ్చిన మార్పులే కారణమని చెబుతున్నారు. 

పొల్యూషన్‌‌, జంక్‌‌ ఫుడ్‌‌, ఊబకాయం, బీపీ, హైపర్‌‌‌‌‌‌‌‌ టెన్షన్‌‌‌‌, డయాబెటిస్, పెయిన్ కిల్లర్లను ఎక్కువగా వినియోగించడం వంటి కారణాలతో జనం కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నారని అంటున్నారు. ఇదివరకు వృద్ధాప్యంలో కనిపించే కిడ్నీ సమస్యలు.. మారిన లైఫ్‌‌ స్టైల్‌‌ కారణంగా చిన్న వయసు వాళ్లలోనూ వస్తున్నాయని చెబుతున్నారు. కిడ్నీ బాధితుల్లో 30 శాతం మంది 35 ఏండ్లలోపు వారే ఉంటున్నారని వెల్లడిస్తున్నారు. తర్వాత జనరేషన్‌‌పై కూడా ఈ ప్రభావం పడుతుండడం గమనార్హం. ప్రస్తుతం పుడుతున్న పిల్లల్లో 7 శాతం మంది కిడ్నీ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

ఐదారేండ్ల పిల్లలకూ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ప్రొటీన్లను వడబోసే ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీంతో రాష్ట్రంలో కిడ్నీ సమస్యల బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నదని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వంద మంది కిడ్నీ పేషెంట్లలో పది మంది పదేండ్లలోపు పిల్లలే ఉంటున్నారని చెబుతున్నారు. ఎర్లీ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుర్తిస్తే వీటన్నింటినీ నయం చేయొచ్చని, పేరెంట్సే ఇందుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పుట్టుకతో వచ్చే సమస్యలు, జన్యు లోపాలు, ఇన్ఫెక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తక్కువ బరువుతో పుట్టడం, నెలల నిండకుండా పుట్టడం వంటి పలు కారణాలు పిల్లల కిడ్నీలను దెబ్బతీస్తున్నాయి. 

చిన్న వయసు నుంచే జంక్ ఫుడ్ అలవాటు చేయడం, సరిపడా నీరు తాగకపోవడం వల్ల కూడా కిడ్నీలపై ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడుతున్నది. ఇటీవల విడుదలైన నేషనల్ న్యూట్రిషన్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. పిల్లలకు కిడ్నీ జబ్బులు ఎక్కువగా వస్తున్న టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పశ్చిమబెంగాల్, సిక్కిం ఉన్నట్టు వివరించింది. ఈ రాష్ట్రాల్లో 5 నుంచి 9 ఏండ్ల మధ్య వయసున్న పిల్లల్లో 7 శాతానికిపైగా కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నట్టు తెలిపింది. ఇక్కడి పిల్లల మూత్రంలో సిరమ్ క్రియాటిన్ ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది.  తల్లిదండ్రులకు కిడ్నీ సమస్య ఉండడం, మేనరికపు, చుట్టరికపు పెండ్లిళ్లు చేసుకున్న వారిలో జెనెటికల్ డిజార్డర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటున్నదని డాక్టర్లు చెబుతున్నారు.

పిల్లల్లో వచ్చే సమస్యలివే

సాధారణంగా మూత్రనాళాల నుంచి బ్లాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మూత్రం చేరుతుంది. దీనికి రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెళ్తే వర్సికోరిట్రల్ రిఫ్లక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిసీజ్ అంటారు. పుట్టుకతోనే మూత్ర నాళాల నిర్మాణంలో లోపాలు ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రిఫ్లక్స్ డిసీజ్ వచ్చే ముప్పు ఉంటుంది. ఇలా రిఫ్లక్స్ అవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలో ఉండే ఫిల్టర్లు పాడవడం, మూత్రం ద్వారా ప్రొటీన్లు బయటకు వెళ్లిపోయి కూడా కిడ్నీలపై భారం పడుతుంది. దీన్నే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. జెనెటికల్ డిజార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ఫిల్టర్లు పాడయ్యే అవకాశముంది. ఈ సమస్య ఎక్కువ మంది పిల్లల్లో కనిపిస్తున్నదని డాక్టర్లు చెబుతున్నారు. 

సడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కాళ్లు, ముఖంలో వాపులు, పొట్ట ఉబ్బడం వంటివి కనిపిస్తే నెఫ్రోటిక్ సిండ్రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనుమానించొచ్చు. 90 శాతం కేసుల్లో మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమస్య తగ్గుతుంది. పిల్లల్లో వచ్చే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా కిడ్నీలను పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి బ్యాక్టీరియా చేరడం వల్ల మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. మన జీర్ణ వ్యవస్థలో ఉండే ఈ-కొలీ బ్యాక్టీరియా వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది రక్తంలోకి చేరితే, యురేమిక్ సిండ్రోమ్ అనే డిసీజ్ వస్తుంది. ఈ సిండ్రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిడ్నీలు పాడవడానికి దారితీస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చేసే టెస్టుల్లోనే పిల్లల్లో వచ్చే కిడ్నీ సమస్యలను గుర్తించొచ్చు.

ఆరోగ్యశ్రీలో అత్యధికం వాళ్లే

ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న వారిలోనూ అత్యధికంగా కిడ్నీ బాధితులే ఉంటున్నారు. ఈ 9 ఏండ్లలో కిడ్నీ పేషెంట్ల ట్రీట్‌‌‌‌మెంట్ కోసమే ఆరోగ్యశ్రీ కింద రూ.700 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో డయాలసిస్‌‌‌‌ పేషెంట్ల సంఖ్య 20 వేలు దాటింది. ఇందుకు తగ్గట్టుగానే డయాలసిస్ సెంటర్ల సంఖ్యను ప్రభుత్వం 40 నుంచి 102కు పెంచింది. ఈ సెంటర్లలో సుమారు పది వేల మంది డయాలసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించుకుంటుండగా, మరో 11 వేల మంది ప్రైవేటు హాస్పిటళ్లలో డయాలసిస్ చేయించుకుంటు-న్నారు. 

ప్రభుత్వ సెంటర్లు చాలడం లేదని, ఇంకా పెంచాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తన నియోజకవర్గంలో డయాలసిస్‌‌‌‌ సెంటర్ పెట్టాలని కోరుతూ, డయాలసిస్‌‌‌‌ పేషెంట్ల ఇబ్బందులను గుర్తు చేస్తూ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గతంలో అసెంబ్లీలోనే కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి హరీశ్‌‌‌‌రావు ఆదేశించారు. దీంతో వంద బెడ్ల దవాఖాన ఉన్న ప్రతి చోట, పది బెడ్లతో డయాలసిస్ సెంటర్లు పెడుతున్నారు.

చివరి దాకా తెలియట్లే

కిడ్నీ జబ్బులపై అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి మొదలైన వెంటనే జనాలు తెలుసుకోలేక పోతున్నారు. మూడో, నాలుగో స్టేజ్ దాకా కూడా గుర్తించలేకపోతున్నారు. చాలా మంది పేషెంట్లు కిడ్నీలు పాడైపోతున్న దశలోనే తమ వద్దకు వస్తున్నారని నెఫ్రాలజిస్టులు చెప్తున్నారు. చిన్న వయసులో బీపీ వచ్చిందంటే, దాదాపు కిడ్నీ సమస్యగానే భావించాలని.. కానీ ట్యాబ్లెట్లు వాడుతూ సమస్య తీవ్రమయ్యే వరకు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. మరోవైపు నెఫ్రాలజి స్టుల సంఖ్య తక్కువగా ఉండడం కూడా రోగులకు శాపంగా మారింది. మన రాష్ట్రవ్యాప్తంగా కలిపి నెఫ్రాలజిస్టులు 200 మంది లోపే ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఇతర డాక్టర్లు సమస్యను తొలిదశలో గుర్తించలేకపోవడం కూడా సమస్యగా మారుతోంది. అన్ని సర్కారు దవాఖానాల్లో డాక్టర్లకు కిడ్నీ కేసుల గుర్తింపుపై శిక్షణ ఇవ్వాలని సూచిస్తున్నారు.

చాలా మందికి తెలియదు..

రాష్ట్రంలో ప్రతి పది మందిలో ఒకరికి కిడ్నీ సమస్య ఉంటుందని అంచనా. చాలా మందికి ఆ విషయం తెలియకపోవడం వల్ల ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకోరు. అందుకే మన కు పేషెంట్ల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే జనాల్లో అవగాహన పెరుగు తుండటంతో ప్రివెంటివ్‌‌‌‌గా టెస్టులు చేయించుకుంటున్నారు. డయాలసిస్‌‌‌‌ సెంటర్లు గతంలో హైదరాబాద్‌‌‌‌లోనే ఉండడంతో సిటీకి వచ్చి చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయేవాళ్లు. సెంటర్లు జిల్లాల్లో అందుబాటులోకి రావ డంతో, రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా డయాలసిస్ చేయిం చుకుంటున్నారు. దీంతో పేషెంట్ల లైఫ్ స్పాన్ పెరిగింది. రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణం.

- డాక్టర్ స్వర్ణలత, నెఫ్రాలజిస్ట్, జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌

కిడ్నీ కోసం ఎదురుచూస్తున్నోళ్లు 6,374 మంది 

రాష్ట్రంలో జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దాన్ ద్వారా ఇప్పటి దాకా 1,917 మందికి కిడ్నీ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ జరిగింది. ఇది బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి సేకరించిన కిడ్నీలతో ట్రాన్స్‌‌ప్లాంట్ చేయించుకుంటున్న వారి సంఖ్య మాత్రమే. కుటుంబ సభ్యుల కిడ్నీ డొనేషన్‌‌తో ట్రాన్స్‌‌ప్లాంట్ చేయించుకుంటున్న వారి సంఖ్య ఏటా వేలల్లో ఉంటున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కిడ్నీ కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 6,374. వెస్ట్రన్ కంట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రెయిన్‌‌ డెడ్‌‌ పేషెంట్ల నుంచి కచ్చితంగా అవయవాలు సేకరించి, ఇతరులకు ఉపయోగిస్తారు. మన దగ్గర అవగాహన లేకపోవడం, అపోహలతో బ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసుల్లోనూ అవయవాలు దానం చేయడంలేదు. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే  జనాల్లో కొంత మార్పు వస్తున్నదని, అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

టెస్టులు చేయించుకోవాలి

కిడ్నీ సమస్యలను ముందే గుర్తిస్తే.. పరిస్థితి డయాలసిస్ వరకు రాకుండా ట్రీట్‌‌మెంట్ ఇవ్వొచ్చు. కానీ చాలా మంది జబ్బు ముదిరే దాకా తమకు ఆ సమస్య ఉన్నట్టు తెలుసుకోలేకపోతున్నారు. కిడ్నీల్లో సమస్య తీవ్రమయ్యే దాకా లక్షణాలు బయటపడకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే సమస్య ఉన్నా లేకున్నా ప్రతి 6 నెలలకు ఒకసారి క్రియాటిన్, కంప్లీట్ యూరిన్ పరీక్ష వంటి బేసిక్ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తాం.

డాక్టర్ గంగాధర్‌‌‌‌, హెచ్‌‌వోడీ, నెఫ్రాలజీ డిపార్ట్‌‌మెంట్, నిమ్స్