ఆ బాలిక మామిడి పండ్లు ఒక్కోటి 10వేలు

 ఆ బాలిక మామిడి పండ్లు ఒక్కోటి 10వేలు
  • బాలిక కల నెరవేర్చేందుకు చేయూతనిచ్చిన వ్యాపారవేత్త
  • ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పుర్ లో ఘటన

తులసి కుమారి 11 ఏళ్ల బాలిక. తల్లిదండ్రులు చాలా నిరుపేదలు. నివసించే ప్రదేశం జంషెడ్ పూర్ లోని మారుమూల మురికివాడ. దరిద్రానికి ప్రతిరూపమైన ప్రదేశంలో వీరి చిన్న పెంకుటిఇల్లే నివాసం. తులసి తల్లిదండ్రులు రోజువారి కూలీలు. రోజూ రెక్కలు ముక్కలయ్యేలా చేసిన పనులతో వచ్చిన డబ్బుతోనే ఆ కుటుంబం గడుపుతోంది. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో కుటుంబం గడవడం కష్టంగా మారింది. 
ఎలాగూ స్కూళ్లు లేవు. ఆన్ లైన్ క్లాసులు అంటున్నారు. కడుపు నిండా తినడానికే ఏమీ లేని కడుపేద కుటుంబం. ఇక స్మార్ట్ ఫోన్ కొనడం అంటే కలలో కూడా జరగని పరిస్థితి. అందుకే వర్తమానంలో ఆలోచించిన చిన్నారి తులసికుమారి తన వంతు కుటుంబానికి చేయూతనిచ్చేందుకు రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతోంది. కొత్త పుస్తకాలు సైతం కొనలేని పేదరికం కావడంతో సెకండ్ హ్యాండ్ బుక్కులతో.. చవకరకం నోటు బుక్కులతో చదువు కుంటోంది. రోజువారిగా పండ్లు అమ్ముతూనే గిరాకీ లేనప్పుడు పుస్తకాలు తీసుకుని చదువుతుంటే ఎవరో ఫోటోలు తీసి షేర్ చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే ముంబైకి చెందిన వ్యాపారవేత్త పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయాడు. 
ఏదైనా నేర్చుకోవాలనే తపన.. కష్టపడి ఎదగాలనే ఆకాంక్ష బాలిక ఫోటోల్లో కనిపించడం చూసి ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. ఎలాగైనా బాలికను కలవాలని నిర్ణయించుకుని ముంబై నుంచి జంషెడ్ పూర్ కు వచ్చాడు. 
తన రోజువారి అలవాటు ప్రకారం తులసి కుమారి మామిడి పండ్లు అమ్ముతుంటే ముంబైకి చెందిన వ్యాపారవేత్త హమేయా హెటె ఆమె వద్దకు వచ్చి పండ్ల ధర ఎంత అని అడిగాడు. డజను కావాలా.. ఎన్ని కావాలి అంటూ బాలిక ప్రశ్నించగా.. డజను కావాలన్నాడు. బాలిక మాటలకు ముచ్చటపడుతూ వ్యాపారవేత్త మాటలు పొడిగిస్తూనే తన వెంట తెచ్చిన ఖరీదైన స్మార్ట్ ఫోన్ తీసి బాలికకు చూపించాడు. దాన్ని తనకు ఇస్తుంటే తీసుకునేందుకు తటపటాయిస్తూ అయోమయంతో చూస్తుండగా.. నీ చదువులు కొనసాగిస్తానంటే ఈ ఫోన్ ఇచ్చేస్తానని షరతు విధించాడు. నిజం చెబుతున్నాడో.. ఆటపట్టిస్తున్నాడో తెలియక..  చదువుకోవడమే ఇష్టమని తెలిపింది. దీంతో ఆయన ఆ ఫోన్ కు ఏడాది వరకు పనిచేసేలా ఇంటర్నెట్ డేటా ప్యాక్ తో రీచార్జ్ చేసి బాలికకు అప్పగించాడు. డజన్ మామిడి పండ్లను కొంటున్నానని.. ఒక్కోటి రూ.10 వేలు అని ఆయనే ధర కట్టి బాలిక తండ్రి బ్యాంక్ అకౌంట్ కు అక్కడికక్కడే  రూ.1 లక్షా 20 వేలు బదిలీ చేశాడు. 
ఓ వ్యాపారవేత్త రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతున్న బాలిక దగ్గర ఒక్కో పండును  రూ.10 వేలు పెట్టి డజను పండ్లు కొనడం..  డజను పండ్ల డబ్బును తండ్రి బ్యాంకు ఖాతాకు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయడం, చదువుకునేందుకు ఏడాదికి సరిపడా డేటా ప్యాక్ తో రీచార్జ్ చేసి ఇచ్చి వెళ్లిన విషయం సంచలనం సృష్టించింది. బాలికను కలిసేందుకు స్థానిక మీడియా ఆమె ఇంటి చిరునామా కనుక్కునేందుకు ప్రయత్నించి షాక్ అయింది. ఎందుకంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన మురికివాడలో చిన్న పెంకుటిల్లే వీరి నివాసం. ఓ వ్యాపారవేత్త తన కుమార్తె చదువు కోసం సాయం చేయడంతో వారు సంతోషంతో పొంగిపోయారు. మా పాప మామిడి పండ్లు అమ్మడం మాకు ఇష్టం లేదు. బాగా చదివించుకోవాలని మాకూ ఆశగా ఉంది. కానీ తిండికి జరగక.. మామిడి పండ్లు అమ్మి కాస్త డబ్బులు తెస్తోంది. ఇప్పుడు దేవుడిలా వచ్చిన ఓ పెద్దాయన ఇచ్చిన డబ్బుతో ఆమె చదువులకు ఇబ్బంది ఉండదు. ఆమె బాగా చదువుకునేలా చేస్తామని చెప్పారు.