- సీఎం రేవంత్‍రెడ్డే పక్కా ప్లాన్‌తో చేపిచ్చిండు: కేటీఆర్
- రేవంత్‌ను మోదీ, అమిత్ షా కాపాడుతున్నరు
- కాదంటే ఈ ఘటనపై సిట్టింగ్
- జడ్జితో విచారణ జరిపించాలి
- పోలీసోళ్లు ఏమైనా పీకగలుగుతరా? మాకు వాళ్లపై నమ్మకం లేదు
- హనుమకొండలో మీడియాతో బీఆర్ఎస్ నేత కామెంట్లు
వరంగల్, వెలుగు: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనక పెద్ద కుట్ర ఉందని, సీఎం రేవంత్‍రెడ్డే పక్కా ప్లాన్ తో దానిని చేయించారని బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం ఆయన హనుమకొండ బీఆర్‍ఎస్ పార్టీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‍భాస్కర్‍తో కలిసి ప్రెస్‍మీట్ లో మాట్లాడారు. ఫొరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం కాదని, ప్రకృతి వైపరీత్యం అంతకన్నా కాదన్నారు. ‘‘ఓటుకు నోటు కేసు నుంచి శాశ్వతంగా తప్పించుకునేందుకే ఆధారాలను సీఎం రేవంత్ తగలబెట్టించారు” అని ఆరోపించారు. ప్రజలందరి దృష్టి మున్సిపల్ ఎన్నికలపై ఉందని.. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ ను తగలబెట్టించే కుట్ర జరిగిందన్నారు. అనేక కేసుల ఆధారాలు కాలిపోవడంతో వివిధ కేసుల్లో శిక్షలు అనుభవించాల్సిన వేలాది మంది నేరగాళ్లు, రేపిస్టులు, దుర్మార్గులు తప్పించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. పొద్దున10 గంటలకు ప్రమాదం జరిగితే మూడంతస్తుల భవనంలో మంటలార్పేందుకు మూడున్నర గంటల సమయం ఎందుకు పట్టిందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘దీనిపై తూతూ మంత్రంగా ప్రెస్‍నోట్ రిలీజ్ చేశారు. ఎఫ్ఐఆర్లో మాత్రం ఫోరెన్సిక్ ల్యాబ్ తో పాటు ప్రాపర్టీ రూం, కేస్ వెరిఫేకెషన్, అనాలసిస్ చాంబర్లు, సర్వర్ రూం మొత్తం కాలిపోయాయని రాశారు. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉన్నట్టుగా అనుమానం ఉంది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే ఈ పని చేశారని అనుకుంటున్నారు” అని ఆరోపించారు. తమకు పోలీసోళ్ల మీద నమ్మకం లేదన్నారు. ‘‘పోలీసోళ్లు ఏమైనా పీకిన్రా.. పీకగలుగుతరా.. నేరస్తుడే హోంశాఖ మంత్రి అయితే ఏం పీకుతరు.. ఏముంది వారి చేతిలో..” అని కామెంట్ చేశారు. మొత్తం ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాము సైంటిస్టులతో కలిసి వస్తామని.. డీజీపీ తమకు మొత్తం చూపించాలన్నారు.
రేవంత్ ను కేంద్రమే కాపాడుతోంది
ప్రధాని మోదీ, సీఎం రేవంత్ మధ్య బడే భాయ్ చోటే భాయ్ బంధం ఉందని.. ఆ బంధమే రేవంత్ ను కేసుల నుంచి కాపాడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఇన్నాళ్లూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకుని సీఎం నెట్టుకొచ్చాడన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని స్వయంగా మోదీ ఆరోపించినా, చర్యలు మాత్రం లేవన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంలా మారిందని అమిత్ షా ఆరోపించారని, కానీ కేసులు మాత్రం లేవన్నారు. హెచ్ సీయూ భూముల విషయంలో రూ. 10 వేల కోట్ల స్కాం జరిగిందని సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీ చెప్పినా.. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని సిఫారసు చేసినా చర్యలు లేవని కేటీఆర్ విమర్శించారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉందని, అందులో స్కాం జరిగినా.. సీఎం రేవంత్ బామ్మర్ది ఉన్నాడని చెప్పినా పట్టించుకోలేదన్నారు. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ రెయిడ్స్ జరిగి ఏడాదైనా.. ఇప్పటికీ కేసు పెట్టలేదని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ వి మాయమాటలు.. మళ్లీ మోసపోవద్దు
వికారాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోయామని.. మళ్లీ ఆ పార్టీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పార్టీ జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి నర్సింలుతో కలిసి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని, ఓట్లు అడిగేందుకు వస్తే ఆ పార్టీ నేతలను నిలదీయాలన్నారు. తమ హయాంలో తాండూరుకు నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి దానిని కొడంగల్ కు తరలించారని కేటీఆర్ విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు.
