కేటీఆర్ హామీ ఇచ్చి మూడేళ్లయినా..మహిళకు అందని సాయం

కేటీఆర్ హామీ ఇచ్చి మూడేళ్లయినా..మహిళకు అందని సాయం

మంత్రి  కేటిఆర్ ఇచ్చిన  హామీ నెరవేరక  ఓ మహిళ  ప్రాణపాయ  స్థితిలో ఉంది. తనకు  వైద్య సహాయం  చేస్తానని  KTR మాట  ఇచ్చి  మూడేళ్లు గడిచినా   పైసా సాయం  అందకపోవడంతో.. మహిళ  ఆరోగ్యం మరింత క్షీణించింది.  ఆ పేద కుటుంబం  ఇప్పటికీ  మంత్రి కేటీఆర్  తన మాట  నిలబెట్టుకుంటారని  ఎదురు చూస్తున్నారు.  కుమ్రంభీం జిల్లాలో  గుండె సంబంధిత  వ్యాధితో బాధపడుతూ... సర్కార్ సాయం  కోసం ఎదురుచూస్తోంది రామ లక్ష్మి.

మంత్రి కేటీఆర్... ఓ మహిళకి సర్కార్ తరపున వైద్య సహాయం చేస్తానని మాటిచ్చి మూడేళ్లు గడిచినా.. ఒక్క మందు బిల్లా ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కేటీఆర్ నుంచి ఎప్పుడు వైద్య సాయం అందుతుందో అని ఆశగా ఎదురు చూస్తోంది.  ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు రామలక్ష్మి. కుమ్రంభీం జిల్లా వాంకిడి మండలానికి చెందిన నరేందర్ తో 9 ఏళ్ల క్రితం రామలక్ష్మికి పెళ్లైంది. బతుకు దెరువు కోసం బెజ్జూర్ మండలానికి వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. నరేందర్ మోటార్ వైండింగ్ మెకానిక్ గా పనిచేస్తుండగా.. రామలక్ష్మి ఇందిరా క్రాంతి పథకం లో అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తోంది. ఐతే కొన్నేళ్ల క్రితం రామలక్ష్మీకి కంటి సమస్య అనారోగ్యం మొదలైంది. ఆ తర్వాత అది కొత్త రకం వ్యాధికి దారి తీసింది. హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్రలోని ఆస్పత్రుల్లో పరీక్షలు చేయగా..  రామలక్ష్మికి గుండెకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. చికిత్సకి 18 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.

రామలక్ష్మి వైద్యం కోసం తనకున్న ఆస్తిని మొత్తం అమ్మి చికిత్స చేయించాడు భర్త. తన స్నేహితులు మూడు లక్షల వరకు సాయం చేయగా.. అప్పటి ఎమ్మెల్యే కోవా లక్ష్మీ 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించింది. ఆ తర్వాత  రామలక్ష్మిని మంత్రి కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్లగా.. ఆమె వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఐతే మంత్రి హామీ  ఇచ్చి మూడేళ్లు గడిచినా... రామలక్ష్మికి ప్రభుత్వం తరపున ఒక్క మందు గోలి కూడా అందలేదని బాధపడుతున్నారు బాధితురాలి భర్త.

 KTR హామీ తర్వాత  రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ తిరిగారు రామలక్ష్మి కుటుంబ సభ్యులు. కానీ వైద్యం చేయడానికి ఏ ఆస్పత్రి ముందుకు రాలేదు. తమిళనాడు లోని ఓ హాస్పిటల్ యాజమాన్యం రామలక్ష్మికి చికిత్స అందించడానికి ముందుకు వచ్చినా.. 18 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటికే రామలక్ష్మి వైద్యం కోసం మిత్రులు, అప్పటి ఎమ్మెల్యే చేసిన ఆర్థిక సహాయం మొత్తం కలిపి 8 లక్షలు బాండ్ల రూపంలో దాచుకున్నారు రామలక్ష్మి భర్త. మరో 10 లక్షలు అవసరం అవగా... కేటీఆర్ సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు.

మంత్రి కేటిఆర్ హామీనిచ్చిన తర్వాత తమిళనాడు హాస్పిటల్ కు వెళ్లిన రామలక్ష్మికి మూడేళ్ల లోపు అపరేషన్ చేయాలని సూచించారు డాక్టర్లు. రామలక్ష్మీ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. తమిళనాడు హాస్పిటల్ డాక్టర్లు.... ప్రస్తుతం పరిస్థితి చేజారిందని, ఆమెకి ఆపరేషన్ చేయలేమని చెప్పారు. దీంతో రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని...ఆపరేషన్ చేయించాలని కోరుతున్నారు.

మంత్రి KTR ఆదుకుంటానని మాట ఇచ్చి మూడేళ్లు గడిచింది.  రోజు రోజుకు రామలక్ష్మీ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.