నేనంటే ఈటలకు భయమన్న హరీశ్

నేనంటే ఈటలకు భయమన్న హరీశ్

తానంటే ఈటల రాజేందర్​ భయపడుతున్నారని, గుండెలు బాదుకుంటున్నారని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. ‘‘ఈటల రోజుకో కేంద్ర మంత్రిని హుజూరాబాద్​కు తెప్పించి మాట్లాడిస్తున్నడు. కేరళ నుంచి మురళీధరన్​ అనే మంత్రిని తెచ్చి ప్రచారం చేపించుకుంటుండు. నేనొస్తే మాత్రం తప్పట. గుండెలన్నీ బాదుకుంటున్నడు. తిడుతున్నడు. నన్ను చూసి భయపడుతున్నడు” అని దుయ్యబట్టారు. దళిత బంధు రాకుండా ఈటల అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. 
ఆదివారం కరీంనగర్​ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సభలో, హుజూరాబాద్​ సెంట్రల్​ ఫంక్షన్​ హాల్​లో నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మేళనంలో హరీశ్ మాట్లాడారు.  రైతులను ఓట్లు అడిగే అర్హత టీఆర్​ఎస్​కు తప్ప మరే ఇతర పార్టీలకు లేదని చెప్పారు. ‘‘బీజేపీ తెచ్చినవి నల్ల చట్టాలంటూ  గతంలో ఈటల రాజేందర్​చెప్పారు. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదామని చెప్పిన ఆయన బీజేపీలో చేరి హుజూరాబాద్​లో రైతులను ఎట్లా ఓట్లు అడుగుతరు? ఈటల రాజేందర్​... ప్రతిసారి నన్ను తిట్టుడు బంజేయ్​. నువ్వు బీజేపీలో జాయినైనవ్​ కదా.. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయించే సత్తా నీకుంటే చేయించు” అని అన్నారు.  కాంగ్రెస్​ పాలనలో కరెంట్​ కోతలు, ట్రాన్స్​ఫార్మర్లు పేలుడు, ఎరువుల కొరత ఉండేదన్నారు.  టీఆర్​ఎస్​ అన్ని వర్గాల కోసం పథకాలను ప్రవేశపెట్టిందని,  బీజేపీ చేసిందేంటో చెప్పాలన్నారు.  ‘‘యాసంగిలో దొడ్డు రకం వడ్లు వేయొద్దని, కొనబోమని కేంద్రం లెటర్​ రాసింది. ఈటలకు ఓట్లు రావాలంటే నన్ను తిట్టుడు కాదు.. ఢిల్లీకి పోయి దొడ్డు వడ్లు కొనాలని ఒప్పించాలి. రైతు చట్టాలను వాపస్​ తీసుకోవాలని ప్రధానిని ఒప్పించాలి” అని హరీశ్​ అన్నారు. 
హుజూరాబాద్​లో ఇండ్లెందుకు కట్టలే?
హుజూరాబాద్​ దళిత బంధు విజయం దేశానికి ఆదర్శం కావాలని, కుట్రలు పన్నుతున్న చీడపీడలను ఏరివేయాలని హరీశ్​ అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ. 9 .90 లక్షలు పడుతున్నట్లు ఫోన్​లో టంగు టంగు మంటూ మెసేజ్​లు  వస్తున్నాయని చెప్పారు. వైన్స్​, కాంట్రాక్ట్​, ఫర్టిలైజర్​ ఇలా అనేక పనుల్లో దళితులకు రిజర్వేషన్​ ఇచ్చేందుకు కేసీఆర్​ కృషి చేస్తున్నారని తెలిపారు. ‘‘ఈటల మంత్రిగా ఉన్నన్నాళ్లూ హుజూరాబాద్​లో ఒక్క డబుల్​ బెడ్రూం ఇల్లు పూర్తి చేయలేదు. మిగతా మంత్రులంతా ఇండ్లు కట్టారు. మళ్లీ ఈటల గెలిస్తే ఇండ్లు కడుతడా” అని హరీశ్​ ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను సీఎం కేసీఆర్  రూ. 8,500 కు పెంచారని గుర్తు చేశారు. కారోబార్ల పదోన్నతికి  సాయం చేస్తానని హామీ ఇచ్చారు.