హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లోని రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రవల్లిలో అసైన్డ్ పట్టాలు కలిగి ఉన్న రైతులను కూడా ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులకు సూచించినట్లు తెలిపారు.
రైతులను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని వెంకటాపురం, ఎర్రవల్లి గ్రామాల మధ్య భూములకు సంబంధించి ఓవర్‌ల్యాప్ సమస్య ఉందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న అసైన్డ్ భూముల వివరాలను పూర్తిగా పరిశీలించి లెక్కలు తేల్చాల్సి ఉందన్నారు.అసైన్డ్ భూములు కొందరి బినామీ పేర్లతో బదిలీ అయినట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోని రైతులతో కొంతమంది కావాలనే మాట్లాడిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. రైతులను రాజకీయ అంశాల్లోకి లాగకుండా, వారి భూములకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను అధికారులు పరిశీలిస్తారని తెలిపారు.రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
